గుట్టలో సామూహిక గిరిప్రదక్షిణ

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సామూహిక గిరిప్రదక్షిణ కార్యక్రమం విజయవంతమైంది. కార్యక్రమంలో సుమారు 8 వేల మంది భక్తులు పాల్గొన్నారు. గిరిప్రదక్షిణ చేసిన వారికి స్వామివారి ప్రత్యేక దర్శన అవకాశం కల్పించడంతో కాలినడకన కొండపైకి చేరుకుని గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకున్నారు. 

ఉదయం 5:45 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద ఈవో భాస్కర్ రావుతో కలిసి ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రత్యేక పూజలు చేసి గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులతో కలిసి కొండ చుట్టూ దాదాపు రెండున్నర కిలోమీటర్లు గిరిప్రదక్షిణ చేశారు. గిరిప్రదక్షిణ చేస్తున్న భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ట్రాక్​తో పాటు లైటింగ్ ఏర్పాటు చేశారు.