
రవితేజ, శ్రీలీల జంటగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మాస్ జాతర’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ రాగా, సోమవారం ఈ చిత్రంలోని మొదటి పాటను విడుదల చేశారు. ‘తు మేరా లవర్’ అంటూ సాగిన ఈ మాస్ పాటను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేయగా, భాస్కరభట్ల క్యాచీ లిరిక్స్ అందించారు.
ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ చక్రికి ట్రిబ్యూట్‌గా ఏఐలో ఆయన వాయిస్‌తో చిత్రీకరించడం హైలైట్‌గా నిలిచింది. రవితేజ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ఇడియట్’లోని ఐకానిక్ సాంగ్ ‘చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే’ బ్యాక్‌గ్రౌండ్ స్కోరుతో ఇంప్రెస్ చేశారు. ‘తు మేరా లవర్.. పెట్టావే చెవిలో క్యాలీఫ్లవర్.. నీలాగే నచ్చలేదే గిచ్చలేదే ఎవ్వరు.. చొక్కాలే చింపుకోరే నాకులాగ అందరూ.. పైకేమో స్కాచ్ బాటిల్‌లాగ నువ్వు సూపరూ.. నీ మైండ్ చూడబోతే చీపు లిక్కరూ.. నా గొంతు కొస్తీవే దొంగ టీచరూ..’ అంటూ సాగిన పాటలో రవితేజ తనదైన స్టైల్‌లో చేసిన స్పెషల్ స్టెప్పులు, శ్రీలీల ఎనర్జీ మెస్మరైజ్ చేస్తున్నాయి. .
భాను మాస్టర్ కొరియోగ్రఫీలో వీరిద్దరి జోడీ ఆకట్టుకుంది. రవితేజ కెరీర్‌లో ఇది 75వ చిత్రం. ఇందులో ఆయన పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ‘ధమాకా’ తర్వాత మరోసారి రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తుండటంతో అంచనాలు ఏర్పడ్డాయి.