బీఆర్ఎస్ లీడర్లకు జనసమీకరణ టార్గెట్!

  • నియోజకవర్గాల్లో  మీటింగ్స్​ పెడుతున్న  లీడర్లు
  • పండుగ పూట కూడా మంత్రి ఆధ్వర్యంలో సమావేశాలు

నల్గొండ, వెలుగు: బీఆర్ఎస్ ​తొలి బహిరంగసభకు లక్షలాదిగా జనాన్ని తరలించడంపై జిల్లా లీడర్లు ఫోకస్ పెట్టా రు. ఈ నెల 18న ఖమ్మం వేదికగా  నిర్వహిస్తున్న  సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలు భారీ జన సమీకరణ కోసం టార్గెట్లు పెట్టుకుని మరి పని చేస్తున్నారు. ప్రతి జిల్లా నుంచి లక్షకు పైగా జనాన్ని తీసుకురావాలని పార్టీ హైకమాండ్​ఆదేశించడంతో ఉమ్మడి జిల్లా నుంచి భారీ సంఖ్యలో  తరలించేందుకు సన్నాహాలు మొదలు పెట్టారు.  ఒక్క సూర్యాపేట జిల్లా నుంచే  1.50 లక్షల మందిని తరలించేందుకు మంత్రి జగదీశ్​రెడ్డి   కసరత్తు చేస్తున్నారు.  కోదాడ, హుజూర్ నగర్, తుంగతుర్తి నియోజకవర్గాలు ఖమ్మం జిల్లాకు  బార్డర్​ ప్రాంతాలుగా ఉండడంతో అక్కడి నుంచి    ఎక్కువగా జనాన్ని తరలించాలని భావిస్తున్నారు.  

నియోజకవర్గానికి 40 వేలకు తగ్గకుండా..

సూర్యాపేట జిల్లాలోని 4 నియోజకవర్గాలలో నియోజకవర్గానికి 40 వేల మందికి తగ్గకుండా సభకు తరలించేందుకు ప్లాన్​ చేస్తున్నట్లు లీడర్లు చెప్తున్నారు. నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం లీడర్లు ఎవరికి వారే తరలి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. బీఆర్ఎస్​గ్రామ, మండల కమిటీలు రోజూ మీటింగ్స్​పెట్టుకుని తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

సభపై  విసృతంగా ప్రచారం

ఓ పక్క సంక్రాంతి పండుగ ఉన్నా..3 రోజుల పాటు నియోజకవర్గాల్లో భారీ జన సమీకరణ కోసం ఏర్పాట్లు చేయాలని పార్టీ  హైకమాండ్​ఆదేశించడంతో .. పండుగను పట్టించుకోకుండా మరి జన సమీకరణ కార్యక్రమాల్లో ముఖ్య నాయకులు మునిగిపోయారు. ఆదివారం మంత్రి జగదీశ్​రెడ్డి కోదాడ, హుజూర్​నగర్​మండలాలల్లో మీటింగ్​పెట్టి నాయకులతో  ఏర్పాట్లపై మాట్లాడారు. ఖమ్మం సభ సమయం దగ్గర పడుతుండడంతో మరో 3 రోజుల పాటు ఆయా నియోజక వర్గాలలో సన్నాహక సమావేశాలు నిర్వహించేలా ప్లాన్ చేసుకుంటున్నారు.