గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాస్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు టీకాలు ఇవ్వనున్నారు. 10 రోజుల పాటు మాస్ వాక్సినేషన్ డ్రైవ్ జరుగనుంది. వ్యాక్సినేషన్ కోసం 30 సర్కిల్స్లో 32 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కోరోజు ఒక్కో సర్కిల్లో వెయ్యి మంది రిస్క్ టేకర్స్‌కు టీకా ఇవ్వనున్నారు. 30 సర్కిల్స్ ద్వారా 10 రోజులలో 3 లక్షల మందికి వాక్సిన్ వేయాలని అధికారులు టార్గెట్‌గా పెట్టుకున్నారు. వ్యాక్సినేషన్ కోసం ఇప్పటికే జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రత్యేకంగా టోకెన్లను పంపిణీ చేసింది. ఒక్కో వ్యాక్సినేషన్ కేంద్రంలో 10 మంది ఏఎన్ఎంలు, 10 మంది డాటా ఆపరేటర్లు, ఇద్దరు డాక్టర్లుతో పాటు సలహాలు సూచనలు కొరకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. పది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి 10 డిఫరెంట్ కలర్స్‌తో కూడిన టోకెన్లు పంపిణీ చేశారు.
కాగా.. కొన్ని ప్రాంతాలలో మాస్ వ్యాక్సినేషన్ సెంటర్లలో టెక్నికల్ సమస్యలు తలెత్తుతున్నాయి. అంబర్ పేటలో ఏర్పాటుచేసిన సెంటర్‌లో 18 నుంచి 45 ఏళ్ల వయసు వారి రిజిస్ట్రేషన్‌లో సమస్యలు వస్తున్నాయి. గతంలో ఆరోగ్యసేతు, కోవిన్‌లో రిజిష్టర్ చేసుకున్న వారి వివరాలు ఇప్పుడు కోవిన్ యాప్‌లో నమోదు కావడంలేదని సిబ్బంది అంటున్నారు. దాంతో వ్యాక్సినేషన్‌కు ఆలస్యమవుతుందన్నారు. దాంతో క్యూలో నిలబడ్డవారు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు.