మూసీలో భారీగా కెమికల్ డంపింగ్.. ట్యాంకర్లను అడ్డుకున్న స్థానికులు..

మూసీలో భారీగా కెమికల్ డంపింగ్.. ట్యాంకర్లను అడ్డుకున్న స్థానికులు..

మూసీలో భారీగా హానికర కెమికల్స్ డంపింగ్ చేస్తుండగా అడ్డుకున్నారు స్థానికులు. కెమికల్, ఫార్మా కంపెనీల్లోని వ్యర్థాలను ట్యాంకర్లతో తెచ్చి గుట్టుచప్పుడు కాకుండా మూసీలో యథేచ్ఛగా డంపింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం ( నవంబర్ 25, 2024 ) అర్థరాత్రి సమయంలో అత్తాపూర్ మూసీ వద్ద రెండు ట్యాంకర్లు పట్టుకొని..  పోలీసులకు అప్పగించారు స్థానికులు.వాటర్ ట్యాంకర్ల ముసుగులో కెమికల్ వ్యర్థాలను మూసీ లో డిస్పోజ్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు  తెలిపారు స్థానికులు.

బాల్ నగర్, షాద్ నగర్, కొత్తూరు ప్రాంతాల్లో ఉన్న కంపెనీల నుండి కెమికల్ వ్యర్థాలను తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ తంతు కొన్నేళ్లుగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. కెమికల్ వ్యర్థాలను మూసీ కాలువ డిస్పోజ్ చేసేందుకు ప్రత్యేక మ్యాన్ హోల్ కూడా ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

20000 లీటర్ల ట్యాంకర్లతో రోజుకు 5, 6 చొప్పున అర్ధరాత్రి పూట దొంగచాటుగా మూసి నదిలో కలుపుతున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేలా కొన్ని సంవత్సరాలు గా జరుగుతున్న ఈ పనులను చాకచక్యంగా పట్టుకున్నామని తెలిపారు స్థానికులు.మూసీ నది పక్కనున్న ముచ్కుంద దేవాలయం, సంగం దేవాలయం వెనకాల బ్రిడ్జి ప్రక్కన ఉన్న ఇసుక డంపింగ్ యార్డ్ యాజమాన్యం తో కుమ్మకై దొంగచాటుగా కెమికల్ వ్యర్థాలను మూసీలో కలుపుతున్నారని స్థానికులు తెలిపారు.