సత్తుపల్లిలో బీజేపీ, కాంగ్రెస్​ లీడర్ల మధ్య వాగ్వాదం

సత్తుపల్లిలో బీజేపీ, కాంగ్రెస్​ లీడర్ల మధ్య వాగ్వాదం

సత్తుపల్లి, వెలుగు  :  రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారంటూ కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్​యూఐ నాయకులు సందీప్ గౌడ్, నండ్రు ప్రశాంత్ మరో ముగ్గురు యువకులతో కలిసి స్థానిక బీజేపీ కార్యాలయంపై దాడికి యత్నించారు. బీజేపీ మండల అధ్యక్షుడు పాలకొల్లు శ్రీనివాస్ పై దాడికి దిగడంతో అక్కడే ఉన్న బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. ఈ ఘటనను నిరసిస్తూ వేంసూర్ రోడ్ లోని బీజేపీ కార్యాలయం ఎదుట రహదారిపై ఆ పార్టీ నాయకులు రాస్తారోకో చేశారు.

 ఈ సందర్భంగా బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వర రావు మాట్లాడుతూ సత్తుపల్లి చరిత్రలో పార్టీ కార్యాలయాలపై, నాయకులపై దాడి చేసే సంస్కృతి లేదని, ప్రస్తుతం కాంగ్రెస్​ నాయకులు కొత్త ఒరవడికి తెర లేపారని విమర్శించారు. ఈ విషయమై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు, ఎస్సీ, ఎస్టీ  కమిషన్లకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దాడికియత్నించిన యువకులను పోలీసులు స్టేషన్ కు తరలించారు.