హైదరాబాద్, వెలుగు: నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో కేసీఆర్.. తెలంగాణ ప్రజలను మోసం చేశారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాశ్ జవదేకర్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అదనంగా 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తారనే ఉద్దేశంతో కేంద్రం రూల్స్ ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టుకు వేగంగా పర్మిషన్లు ఇచ్చిందని స్పష్టం చేశారు. కానీ ఈ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందన్నారు.
అలాగే ప్రాజెక్టులు, పథకాల పేరుతో రూ.5 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిపై ఎప్పుడో చర్యలు ప్రారంభమయ్యాయని చెప్పారు. నిరుద్యోగుల కోసం నియామకాలు చేయమంటే పేపర్ లీకులు చేశారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అరాచక పాలనకు వ్యతిరేకంగా బీజేపీ ఏం చేయాలో అది చేసి చూపిస్తుందని హెచ్చరించారు. రానున్న రోజుల్లో బీజేపీలో భారీగా చేరికలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అవసరమైన సీట్లను గెలుచుకుంటామని స్పష్టం చేశారు. పార్టీ అభ్యర్థుల ప్రకటనపై కొద్దిగా వేచి చూడాలన్నారు.