- ఆందోళనకు గురైన వాకర్లు.. వాసన భరించలేక కంప్లయింట్
- శాంపిళ్లు తీసుకున్న అధికారులు
- ఆక్సిజన్ అందకపోవడమే కారణం!
ఖైరతాబాద్, వెలుగు : బంజారాహిల్స్‌లోని లోటస్ పాండ్‌లో భారీగా చేపలు చనిపోయాయి. బుధవారం పెద్ద సంఖ్యలో చనిపోయిన చేపలు నీటిపై తేలుతూ కనిపించాయి. రోజూ వాకింగ్‌కు వచ్చే వాళ్లు ఈ విషయాన్ని గుర్తించి అధికారులను అప్రమత్తం చేశారు. రెండు రోజుల నుంచి చేపలు చనిపోతున్నాయనీ, బుధవారానికి వాటి సంఖ్య బాగా పెరిగిందని వాకర్లు చెప్తున్నారు. బిజీ లొకాలిటీలో ఎంతో ప్రశాంతంగా ఉండే పాండ్ఇలా మారడంతో వాళ్లు ఒకింత ఆందోళన చెందారు. వాకర్ల కంప్లయింట్‌తో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫిషరీస్ డిపార్ట్మెంట్, జీహెచ్ఎంసీ అధికారులు లోటస్ పాండ్ వద్దకు చేరుకున్నారు.
నీటి శాంపిళ్లు, చనిపోయిన చేపలను సేకరించి టెస్టింగ్‌కు పంపించారు. చేపల సంఖ్య ఎక్కువై ఆక్సిజన్ అందకనే చనిపోయి ఉంటాయని అంచనా వేస్తున్నట్లు ఫిషరీస్ డిపార్ట్మెంట్అధికారులు ‘వెలుగు’తో చెప్పారు. ప్రస్తుతానికి చేపలకు ఆక్సిజన్ ట్యాబ్లెట్లు అందజేస్తామన్నారు. రిపోర్టులు వచ్చిన తర్వాత చేపట్టాల్సిన చర్యలను పరిశీలిస్తామని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు పరిసర ప్రాంతాల్లోని డ్రైనేజీలు పొంగి ఆ నీళ్లు పాండ్‌లోకి వచ్చాయని వాకర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. వాకర్లు, చుట్టుపక్కల చిరు వ్యాపారాలు చేసేవాళ్లు చెరువులో వ్యర్థ్యాలు వేయొద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.