ఛత్తీస్ గఢ్‎లో భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి

రాయ్‎పూర్: ఛత్తీస్ గఢ్‎లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. గురువారం (జనవరి 16) బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. 

అధికారుల వివరాల ప్రకారం.. గురువారం బీజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం అయ్యారని ఇంజలిజెన్స్ సమాచారం అందింది. ఇంటలిజెన్స్ సమాచారం మేరకు మూడు జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ , కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్) ఐదు బెటాలియన్లు, సీఆర్ఫీఎఫ్‎కు చెందిన చెందిన 229వ బెటాలియన్‌తో సహా భద్రతా సిబ్బంది జాయింట్ ఆపరేషన్ చేపట్టింది. 

ALSO READ | ఎవరీ దయానాయక్.. సైఫ్ అలీఖాన్ ఇంటికి ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఎందుకెళ్లారు..?

భద్రతా దళాలు జల్లెడ పడుతుండగా ఉదయం 9 గంటల ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. తొలుత భద్రతా దళాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. వెంటనే రియాక్ట్ అయిన భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. కొన్ని గంటల పాటు జవాన్లు, మావోయిస్టుల మధ్య భీకరంగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతం అయ్యారు. జవాన్లకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.

 ఘటన స్థలంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. కాగా, 2025, జనవరి 7వ తేదీన బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందు పాతర పేలి 8 మంది జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు కూంబింగ్ ముమ్మరం చేశాయి. 8 మంది జవాన్ల మృతి ప్రతీకారంగా 12 మంది మావోస్టులను మట్టుబెట్టాయి భద్రతా దళాలు.