శ్రీనగర్: సంక్రాంతి పండుగ వేళ జమ్మూ కాశ్మీర్లో భారీ పేలుడు సంభవించింది. ల్యాండ్ మైన్ పేలి ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన 2025, జనవరి 14న రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ సమీపంలో చోటు చేసుకుంది. అధికార వర్గాల ప్రకారం.. గోర్ఖా రైఫిల్స్‌కు చెందిన జవాన్లు మంగళవారం ఉదయం రాజౌరిలోని ఖంబా కోట సమీపంలో సాధారణ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు ల్యాండ్ మైన్ బ్లాస్ట్ అయ్యింది. ఈ ఘటనలో ఆరుగురు సైనికులు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. ఘటన స్థలంలో సహయక చర్యలు చేపట్టారు.
ALSO READ | పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. భారీ శబ్ధాలతో లోకో పైలట్ అలెర్ట్
గాయపడిన సిబ్బందిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన జవాన్ల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. మందు పాతర పేలుడుపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రధాని మోడీ సోమవారం జమ్మూ కాశ్మీర్ లో పర్యటించి.. వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రధాని పర్యటించిన మరుసటి జమ్మూలో బ్లాస్టింగ్ జరగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.