
లేఆఫ్ లను స్పీడప్ చేస్తున్న ట్రంప్
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను అధ్యక్షుడు ట్రంప్ సర్కారు నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నది. శుక్రవారం 10 వేల మందిని ప్రభుత్వం తొలగించింది. ఇంటీరియర్, ఎనర్జీ, వెటరన్ అఫైర్స్, అగ్రికల్చర్, హెల్త్, హ్యూమన్ సర్వీసెల్ లో ఉద్యోగులకు స్వస్తి పలికారు. అలాగే, కొన్ని ఏజెన్సీలను కూడా మూసివేశారు. స్వతంత్ర నిఘా సంస్థ కన్జ్యూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరో వంటివి బంద్ చేసిన ఎజెన్సీల్లో ఉన్నాయి.
మరోవైపు ట్యాక్స్ కలెక్టర్ ఏజెన్సీ అయిన ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ కూడా వచ్చే వారం ఉద్యోగులపై వేటు వేయనుంది. ఆ విభాగంలో వేల మంది ఉద్యోగులను తొలగించనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. కాగా.. అంతకుముందు 75 వేల మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీచేసిన ఆదేశానికి తాజా తొలగింపులు అదనం.