
నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో గురువారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. యూనివర్సిటీలోని క్యాంటీన్ సమీపంలో గల గడ్డివాములో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు చుట్టుపక్కల వ్యాపించడంతో యూనివర్సిటీలో 100 ఎకరాల్లో చెట్లు కాలిపోయాయి. మంటలను గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
వారు ఘటనాస్థలానికి చేరుకొని నాలుగు గంటల పాటు ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. క్యాంటిన్ సమీపంలో మంటలు ఎలా చెలరేగాయి ? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఎగ్జామినేషన్ బ్రాంచ్‌కు సమీపంలోనే మంటలు చెలరేగడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే నిప్పు పెట్టినట్లు యూనివర్సిటీ సిబ్బంది అనుమానిస్తున్నారు.