![చార్మినార్ మదీనాలో భారీ అగ్ని ప్రమాదం..50 బట్టల షాపులు దగ్ధం.. రూ.10 కోట్ల ఆస్తి నష్టం](https://static.v6velugu.com/uploads/2025/02/massive-fire-breaks-out-at-charminar-madina_cLSD0nyO6C.jpg)
- 10 ఫైరింజన్లతో 12 గంటలపాటు సహాయక చర్యలు
- రంజాన్, పెండ్లిళ్ల సీజన్ కావడంతో షాపుల నిండా బట్టలు
చార్మినార్, వెలుగు: పాతబస్తీలోని చార్మినార్సమీపంలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ బట్టల షాపులో చెలరేగిన మంటలు 50 షాపులకు వ్యాపించాయి. దాదాపు రూ.10 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. మదీనా ఏరియాలోని అబ్బాస్ టవర్స్ లో వందల బట్టల షాపులు కొనసాగుతున్నాయి. వ్యాపారులు రోజూలాగే ఆదివారం రాత్రి షాపులను క్లోజ్చేసి ఇండ్లకు వెళ్లిపోయారు.
అర్ధరాత్రి తర్వాత 1.30 గంటల ప్రాంతంలో అబ్బాస్టవర్ మూడో అంతస్తులోని ఓ షాపులో మంటలు చెలరేగాయి. తర్వాత పక్క షాపులకు వ్యాపించాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న వ్యాపారులు అక్కడికి చేరుకునేలోపే రెండు, మూడు అంతస్తుల్లోని షాపులకు మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే 50 షాపులు దగ్ధమయ్యాయి. వాటిలోని బట్టలు కాలి బూడిదయ్యాయి. ఇతర షాపుల వ్యాపారులు తమ సరుకును వేరే చోటుకు తరలించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని దాదాపు 10 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు.
సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు సహాయక చర్యలు కొనసాగాయి. రంజాన్ పండుగ సమీపిస్తుండడంతో వ్యాపారులు భారీగా స్టాక్ తెచ్చి పెట్టుకున్నారు. షార్ట్సర్క్యూట్కారణంగా మంటలు చెలరేగాయని, దాదాపు రూ.10 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెల్లవారుజాము కావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేశారు.