
హైదరాబాద్ లో వేర్వేరు చోట్ల ఒకేసారి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. సోమవారం (ఫిబ్రవరి 24) మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ లో ఓ ఫర్నీచర్ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో గోదాంలోని ఫర్నీచర్ తగలబడి పోయింది. భారీగా మంటలు ఎగసిపడటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. గోదాంలో ఉన్న సిబ్బంది బయటకు పరుగులు తీశారు.
సమాచారం తెలుసుకున్న నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహటిన అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. భారీగా ఎగసిపడుతున్న మంటలు, పొగ కారణంగా స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
మంటలు వెంటనే పక్కనే ఉన్న అపార్ట్ మెంట్ లోకి అంటుకోవడంతో అపార్ట్ మెంట్ వాసులు ఆందోళనకు గరై బయటకు పరుగులు పెట్టారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
కుత్బుల్లాపూర్ స్క్రాప్ గోడౌన్ లో చెలరేగిన మంటలు:
కుత్భుల్లాపూర్ పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి మైసమ్మగూడ లో ని ఓ స్క్రాప్ గోడౌన్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపింది. గోడౌన్ లో ఉన్న వస్తువులకు మంటలు అంటుకుని గోడౌన్ మొత్తం వ్యాపించాయి. భారీగా మంటలు అంటుకోవడంతో స్థానికులు ఫైర్ అధికారులకు సమాచారం అందించారు.
అగ్ని మాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల తో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దాదాపు రెండు గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో సుమారు కోటి రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.