
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం (ఏప్రిల్ 27) అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆగమేఘాలమేద ఘటనా స్థలానికి చేరుకున్నారు. 12 ఫైరింజన్ల సహయంతో భారీగా ఎగసిపడిన మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది.
దక్షిణ ముంబైలోని బల్లార్డ్ ప్రాంతం కుర్రింబోయ్ రోడ్డులోని గ్రాండ్ హోటల్ సమీపంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయం ఉన్న కైజర్-ఐ-హింద్ భవనంలో ఆదివారం రాత్రి 2:30 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు సమాచారం అందిందని ఫైర్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. సమాచారం తెలిసిన వెంటనే ఘటన స్థలానికి చేరుకుని 12 ఫైరింజన్లతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఐదు అంతస్తుల భవనంలో నాల్గవ అంతస్తు వరకే మంటలు వ్యాపించాయని చెప్పారు.
ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని ముంబై అగ్నిమాపక శాఖ తెలిపింది. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈడీ కార్యాలయంలో ఫైర్ యాక్సిడెంట్ ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. ప్రమాదవశాత్తూ జరిగిందా..? మరేదైనా కారణం ఉందా..? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.