పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనంలో మంటలు

పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనంలో మంటలు

కరాచీలోని పాకిస్థాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనంలో సోమవారం(జులై 08) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనంలోని నాల్గవ అంతస్తులో ఈ మంటలు అంటుకున్నాయి. దాంతో, ట్రేడింగ్(PSX కార్యకలాపాలు) నిలిపివేశారు.

సమాచారం అందుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే, మంటలంటుకున్న నాల్గవ అంతుస్తులోని ఫైల్స్, కంప్యూటర్ పరికరాలు కాలి బూడిదైనట్లు వివరించారు. మంటలు ఎలా చెలరేగాయి అనే దానిపై పోలీసులు విచారణ మొదలు పెట్టారు.

అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో సోమవారం ఉదయం 10:25 నుండి 11:25 వరకు ట్రేడింగ్‌ తాత్కాలికంగా నిలిపివేసినట్లు PSX జనరల్ మేనేజర్, చీఫ్ మార్కెట్ ఆపరేషన్స్ ఆఫీసర్ జవాద్ హెచ్ హష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని గంటల అనంతరం ట్రేడింగ్ తిరిగి ప్రారంభమైనట్లు ఆయన వెల్లడించారు.