- హైదరాబాద్ జియాగూడలో ఘటన
మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్ కుల్సంపురాలోని వెంకటేశ్వ నగర్ లో ఉన్న సోఫా గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. జియాగూడలోని గోపి హోటల్ ఎదురుగా ఉన్న వేంకటేశ్వరనగర్ లో నాలుగు అంతస్తుల బిల్డింగులో 20 ఏండ్లుగా సోఫా గోదాం నడుస్తున్నది. శ్రీనివాస్(40) అనే వ్యక్తి తన భార్య నాగరాణి, పిల్లలు శివప్రియ(10), హరిణితో కలిసి గోదాంలోనే పనిచేస్తూ అక్కడే ఓ రూంలో నివసిస్తున్నాడు. వీరితోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన దాదాపు 25 మంది వర్కర్లు కూడా అక్కడే ఉంటున్నారు.
బుధవారం తెల్లవారుజామున బిల్డింగ్గ్రౌండ్ఫ్లోర్లో షాక్ సర్క్యూట్ జరిగింది. దాంతో ఒక్కసారిగా బిల్డింగుకు మంటలు అంటుకునిమొత్తం వ్యాపించాయి. శ్రీనివాస్, అతని కూతురు శివప్రియతో పాటు 25 మందికి పైగా మంటల్లో చిక్కుకుపోయారు. గమనించిన స్థానికులు తాళ్ల సాయంతో అందరినీ బయటికి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్, శివప్రియ చనిపోయారు. గాయాలపాలైన 20 మందిని అంబులెన్సుల్లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఫైర్‌సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్లతో ఉదయం 6.30 గంటలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కార్వాన్ పరిధిలో గోదాములు ఎక్కువగా ఉన్నాయని, వాటికి పలుమార్లు నోటీసులు అందజేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. జియాగూడ ప్రాంతంలోని గోదాములను శివారు ప్రాంతాలకు తరలించాలని స్థానికులు కోరుతున్నారు.