- కి.మీ. మేర కమ్మేసిన పొగ
- తులసి కెమికల్స్ అక్రమ గోదాంలో ఘటన
- కండ్ల మంటలు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డ స్థానికులు
- పరారీలో కంపెనీ నిర్వాహకులు
జీడిమెట్ల, వెలుగు : జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దూలపల్లి రోడ్డులో అక్రమంగా నిర్వహిస్తున్న తులసి కెమికల్స్ గోదాంలో శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఒక డ్రమ్ములోంచి మరో డ్రమ్ములోకి కెమికల్‌ను ఒంపుతుండగా, స్టాటిక్ ఎనర్జీ (స్థిర విద్యుత్)తో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు.
కెమికల్కావడంతో సెకన్ల వ్యవధిలోనే మంటలు మిగిలిన డ్రమ్ములకు అంటుకుని పెద్దఎత్తున ఎగసిపడ్డాయి. దట్టమైన నల్లటి పొగ కిలోమీటర్ల మేర కమ్మేయడంతో స్థానికులతోపాటు దూరంగా ఉన్న పలు కాలనీల ప్రజలు సైతం భయాందోళనకు గురయ్యారు. ప్రధానంగా గోదాం చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులు కండ్ల మంటలు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని, రెండు ఫైర్‌ఇంజిన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో కూకట్పల్లి, మల్కాజిగిరి, సనత్‌నగర్ కు చెందిన మరో మూడు ఫైర్ ఇంజిన్లను తెప్పించారు. అనంతరం ఫోమ్సహయంతో సుమారు 3 గంటలకు పైగా శ్రమించి, చివరకు మంటలను అదుపులోకి తెచ్చారు.
పరారైన యాజమాన్యం
అగ్నిప్రమాదం సంభవించగానే కెమికల్ గోదాం నిర్వాహకులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో గోదాంలో ఎలాంటి కెమికల్స్ నిల్వచేశారో తెలియక ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడానికి శ్రమించాల్సి వచ్చింది. చుట్టూ ఉన్న గోడలను బద్ధలుకొట్టి లోపలికి ప్రవేశించిన తర్వాత ఫోమ్సహాయంతో మంటలను ఆర్పివేశారు. పోలీసులు, ఫైర్ సిబ్బందికి సైతం నిర్వాహకులు సమాచారం ఇవ్వలేదు. దీంతో అక్రమంగా నిర్వహిస్తున్న ఈ గోదాంలో నిషేధిత కెమికల్స్ ఏమైనా ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారిస్తే అనేక విషయాలు బయటపడే అవకాశం ఉంది.
బాంబుల్లా ఎగసిపడ్డ కెమికల్ డ్రమ్ములు
గోదాంలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండా పెద్ద సంఖ్యలో ఫార్మా కంపెనీలకు కావాల్సిన కెమికల్ డ్రమ్ములను ఒకదానికొకటి ఆనించి పెట్టినట్లు తెలిసింది. మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా కెమికల్డ్రమ్ములు బాంబుల్లా పేలి గాల్లోకి ఎగిరిపడ్డాయంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఎగిరిపడ్డ డ్రమ్ములు పక్కనే ఉన్న రెండు ఫ్యాబ్రికేషన్కంపెనీలపై పడి పైకప్పులు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. రోడ్డు పక్కనే ఈ కెమికల్ గోదాం ఉండడంతో అటుగా వెళ్లే ప్రయాణికులకు డ్రమ్ములు పేలి తగిలే ప్రమాదం ఉండడంతో పోలీసులు ట్రాఫిక్‌ను నిలువరించారు.
మంటల్లో కాలిపోయిన వాహనం, విద్యుత్తు తీగలు
మంటలు ఉవ్వెత్తున్న ఎగసిపడడంతో ఆ తీవ్రతకు గోదాం ముందు కరెంట్ స్తంభాలకు ఉన్న వైర్లు పూర్తిగా కాలిపోయాయి. అలాగే ఓ వాహనం పూర్తిగా దగ్ధమైంది. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో దూలపల్లి రోడ్డుపై రాకపోకలు స్తంభించి భారీగా ట్రాఫిక్జామ్నెలకొంది. మంటలు అదుపు చేసిన అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పేట్‌బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న కంపెనీ నిర్వాహకుల కోసం గాలిస్తున్నారు.
నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లో మంటలు
గండిపేట్: కోకాపేట నియో పోలీస్ లో నిర్మాణంలో ఉన్న మై హోమ్ గ్రూప్ అపార్ట్మెంట్లో ప్రమాదవశాత్తు శుక్రవారం మంటలు చెలరేగాయి. దీంతో స్థానిక ప్రజలు, భవనంలో పని చేస్తున్న కార్మికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.