
- మణుగూరు ఏరియాలోని రథం గుట్టల్లో చెలరేగిన మంటలు
- కమ్ముకున్న దట్టమైన పొగతో స్థానికుల ఉక్కిరిబిక్కిరి
- మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న అటవీ అధికారులు
మణుగూరు, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రథం గుట్టల రిజర్వ్ ఫారెస్ట్ లో కార్చిచ్చు అంటుకుంది. భారీ ఎత్తున మంటలు చెలరేగి అడవి తగలబడుతోంది. దీంతో మణుగూరు టౌన్ తో పాటు పరిసర గ్రామాల్లో దట్టమైన పొగ కమ్ముకోగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు మంటలను అదుపులోకి తెచ్చే చర్యలు చేపట్టారు.
అయితే.. గత మూడు రోజులుగా అశ్వాపురం, మణుగూరు మండలాల్లోని అటవీ ప్రాంతం భారీ ఎత్తున మంటలు చెలరేగినా అటవీశాఖ అధికారులు స్పందించలేదు. రెండు మండలాల్లోని ప్రజలు కంప్లైంట్ చేయడంతో శుక్రవారం మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. రథం గుట్టల పైకి నీటిని తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో మంటలు వ్యాపించకుండా చుట్టూ ఆకులు, చెత్తాచెదారాన్ని తొలగించే పనులు చేస్తున్నారు.