
హైదరాబాద్: అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరాంఘర్‌లో ఇవాళ మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మహీంద్రా షోరూమ్ వెనుక ప్రాంతంలోని ఎంఎం పహాడీలోనూ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎంఎం పహాడీలోని స్క్రాప్ గోదాం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ఏరియాల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. మంటలను గమనించిన స్థానికులు అక్కడినుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని.. 2 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.