- ఆరు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్న సిబ్బంది
- పక్కనే ఉన్న రబ్బర్ ఫ్యాక్టరీకి మంటలు
చర్లపల్లి, వెలుగు: సిటీ శివారు చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలోని సర్వోదయ సాల్వెంట్ కెమికల్ ఫ్యాక్టరీలో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఎగసిపడిన మంటలను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు క్రమంగా పెరిగి పక్కనే ఉన్న మహాలక్ష్మి రబ్బర్ కంపెనీకి అంటుకోవడంతో రసాయనాల ఘాటుతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆరు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
రాచకొండ సీపీ సుధీర్ బాబు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఫైర్సిబ్బందికి సూచనలు ఇస్తూ ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నించారు. అధికారులకు, స్థానికులకు తగిన జాగ్రత్తలు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు, ఎంత ఆస్తి నష్టం జరిగిందనేది తెలియాల్సి ఉంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక కూడా మంటలు ఎగిసి పడుతూనే ఉన్నాయి.