
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం (మార్చి 11) తెల్లవారుజామున తూర్పు ఢిల్లీలోని ఆనంద్ విహార్ వద్ద ఉన్న ఏజీసీఆర్ ఎన్‌క్లేవ్ సమీపంలోని ఓ గుడిసెలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంట్లలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. గమనించిన స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. మృతులను ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్య జిల్లాకు చెందిన జగ్గీ కుమార్ (34), శ్యామ్ సింగ్ (36) మరియు జితేందర్ కుమార్ (35)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేస్తోన్నట్లు పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణం ఏంటన్న దానిపై ఆరా తీస్తున్నామని చెప్పారు.
ఈ ఘటనపై స్టేషన్ అధికారి ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ.. మంగళవారం (మార్చి 11) తెల్లవారుజామున 2:22 గంటలకు ఢిల్లీ అగ్నిమాపక సేవలకు అగ్ని ప్రమాద సమాచారం అందిందని తెలిపారు. వెంటనే మూడు అగ్నిమాపక యంత్రాలను సంఘటనా స్థలానికి పంపించామని ఆయన చెప్పారు. తెల్లవారుజామున 2:50కి మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపారు. మంటలు అదుపు చేసిన అనంతరం అగ్ని ప్రమాదం జరిగిన గుడిసె లోపల నుంచి మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు.