- భారీ ఎత్తున చెట్లు దగ్ధం.. ఓ కుక్క మృతి
- ఫైర్‌సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ప్రమాదం.. వణ్యప్రాణులు సేఫ్
ఎల్బీనగర్, వెలుగు: హైదరాబాద్ శివారులోని ‘హరిణ వనస్థలి నేషనల్ పార్కు’లో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో నాగోలు ఫతుల్లాగూడ వైపు ఉన్న ముక్తీఘాట్ సమీపంలో పార్కులో మంటలు చెలరేగాయి. కొంతమేర చెట్లు తగలబడ్డాయి. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫారెస్ట్, ఫైర్‌సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ పార్కులో జింకలతోపాటు నెమళ్లు, అడవి పందులు, కుందేళ్లు ఇతర జంతువులు ఉంటాయి.
అధికారుల అప్రమత్తతో వాటికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. మంటల్లో ఓ కుక్క కాలిపోయినట్లు తెలుస్తోంది. దట్టమైన పొగలతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో స్థానికులు బాయాందోళనకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతోనే పార్కులో అగ్నిప్రమాదాలు జరుతున్నాయని చెప్పారు. ఫారెస్ట్ ఆఫీసర్ విద్యాసాగర్ స్పందిస్తూ ఈ ప్రమాదంలో వన్యప్రాణులకు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు.