బంగ్లాదేశ్ షాపింగ్​మాల్ లో ఘోర అగ్నిప్రమాదం.. 44మంది మృతి

బంగ్లాదేశ్ లో ఫిబ్రవరి 29వ తేదీ గురువారం అర్థరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో 44మంది మృతి చెందగా.. దాదాపు 20మందికి పైగా గాయపడ్డారు.  దేశ రాజధాని ఢాకా నగరంలోని  బెయిలీ రోడ్‌లో  గ్రీన్​ కోజీ కాజేట్ పేరుతో ఉన్న కమర్షియల్​షాపింగ్​ మాల్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.  మొదటి అంతస్తులోని ఓ రెస్టారెంట్ లో చెలరేగిన మంటలు.. క్రమంగా బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి.  

ప్రమాద సమయంలో బిల్డింగ్ లోని పలు రెస్టారెంట్లలో చాలా మంది ఉన్నారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను చూసి భయంతో మాల్ నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో తమను తాము రక్షించుకునేందుకు చాలా మంది బిల్టింగ్ నుంచి కిందకు దూకి తీవ్ర గాయాలతో మృతి చెందగా.. మరికొంత మంది పొగకు ఊపిరి ఆడక మరణించారు. మరికొంతమంది పొగతో ఊపిరాడక స్పృహా కోల్పోయి కిందపడిపోయారు.

అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిప్రమాదక సిబ్బంది.. హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 80మందిని రక్షించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం13 ఫైర్​ఇంజన్లతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఆరోగ్య శాఖ మంత్రి సమంత లాల్​ సేన్​తో వెంటనే ఘటనాస్థలానికి వెళ్లి.. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు.