ఏపీలో భారీగా పోలింగ్..78 శాతం నమోదు

  •  ఓటు వేసిన సీఎం జగన్, చంద్రబాబు, పవన్​కల్యాణ్, షర్మిల
  • పలుచోట్ల ఘర్షణలు, రాళ్లురువ్వుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు
  • ఓటరుపై చేయిచేసుకున్న తెనాలి వైసీపీ అభ్యర్థి 
  • ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ.. హౌస్ అరెస్టుకు ఆదేశం
  • పలు చోట్ల పోలింగ్​ ముగిసే దాకా ఎమ్మెల్యే అభ్యర్థుల హౌస్ అరెస్టులు
  • మూడు చోట్ల ఈవీఎంలు ధ్వంసం..

హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్​లో 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలకు సోమవారం జరిగిన ఎన్నికల్లో భారీగా పోలింగ్​ నమోదైంది. 78 శాతంపైగా పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం(ఈసీ) ఓ ప్రకటనలో తెలిపింది. ఏపీలో సిటీల నుంచి గ్రామాల వరకు అన్ని చోట్ల ఎలక్షన్‌ జోష్‌ కనిపించింది.. పౌరులు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని చోట్ల క్యూలైన్లలో ఓటర్లు ఉండడంతో రాత్రి 11 గంటల తర్వాత కూడా పోలింగ్ కొనసాగింది. అక్కడక్కడా ఘర్షణలు మినహా పోలింగ్​ దాదాపు ప్రశాంతంగా ముగిసింది. పల్నాడు, నరసరావుపేట, తెనాలి, తాడిపత్రి వంటి కొన్ని చోట్ల ఘర్షణలు జరిగాయి. కొన్ని గ్రామాల్లో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య పరస్పర దాడులు, రాళ్లు రువ్వుకోవడం లాంటివి చోటుచేసుకున్నాయి.

ఓటేసిన సీఎం జగన్, చంద్రబాబు

ఏపీ సీఎం జగన్, ఆయన భార్య భారతి పులివెందులలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు, లోకేశ్​, భువనేశ్వరి, బ్రాహ్మణి మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి గ్రామంలో ఓటు వేశారు. కడప జిల్లా వేంపల్లె మండలం ఇడుపుల పాయ పోలింగ్ బూత్ లో వైఎస్​ షర్మిలారెడ్డి, బ్రదర్ అనిల్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్, భార్య కొనిదెల అన్నా మంగళగిరిలో ఓటు వేశారు. 

ఓటరుపై చేయిచేసుకున్న వైసీపీ అభ్యర్థి

తెనాలిలో వైసీపీ అభ్యర్థి అన్నా బత్తుని శివకుమార్ క్యూలైన్​లో ఉన్న ఓటరుపై చేయిచేసుకున్నాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ.. పోలింగ్​అయిపోయే వరకు అతన్ని హౌస్ అరెస్టు చేయించింది. ఓటేసేందుకు బూతులోకి నేరుగా వెళ్తున్న శివకుమార్ ను క్యూలో రావాలని ఒక ఓటరు చెప్పడంతో అతను చేయిచేసుకున్నాడు. ఆ వ్యక్తి కూడా శివకుమార్ చెంప చెల్లుమనిపించారు.

దీంతో ఎమ్మెల్యే అభ్యర్థి అనుచరులు అతనిపై దాడికి పాల్పడ్డారు. ఈ సమాచారం తెలిసిన ఈసీ.. శివకుమార్ ‍పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ‘‘మాల, మాదిగ కులాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కొమ్ముకాస్తున్నావ్, నువ్వు అస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్మోడివేనా” అని సదరు టీడీపీ కార్యకర్త అస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌భ్యంగా మాట్లాడడంతోనే తాను చెయ్యి చేసుకోవాల్సి వచ్చిందని శివకుమార్ మీడియాతో తెలిపారు. 

వైసీపీ ఎంపీ అభ్యర్థి, తాడిపత్రి ఎస్పీపై రాళ్లదాడి 

బాపట్ల ఎంపీ అభ్యర్థి నందిగాం సురేశ్ కారుపై పర్చూరు నియోజకవర్గం పరిధిలోని పెద నక్కలపాలెం గ్రామం దగ్గర టీడీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగేడు గ్రామంలో గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ బాంబులు విసిరారు. ఇక్కడి రెంటచింతల జెట్టిపాడు, రంపూడి మండలం ఒప్పిచర్ల, అన్నమయ్య జిల్లా రాజంపేట నిజయోజకవర్గం పుల్లంపేట మండలం దలువాయిపల్లిలో కొందరు దుండగులు పోలింగ్ బూతులపై దాడి చేసి ఈవీఎంలు ధ్వంసం చేశారు.  తాడిపత్రిలో ఎస్పీ అమిత్ బర్దర్ వాహనం పై రాళ్లు రువ్వారు. దీంతో ఓ బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్ జవాన్ ​కంటికి గాయం అయింది.  

నరసరావుపేటలో ఉద్రిక్తం

నరసరావుపేటలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు ఉద్రిక్తతకు దారి తీశాయి. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద బాబు కార్లను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఒక బొలెరో వాహనాన్ని తగలబెట్టారు. వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డీ శ్రీనివాస్ రెడ్డిని గృహనిర్భంధంలో ఉంచాలని ఈసీ ఆదేశించింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పుల్లలచెరువు మండలం ముటుకులో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో కానిస్టేబుల్​ ఒక రౌండ్ గాల్లోకి, రెండు రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు భూమి పైకి కాల్పులు జరిపాడు.

దీంతో కానిస్టేబుల్ చేతికి గాయం కాగా.. మరో ముగ్గురు కూడా స్వల్పంగా  గాయపడ్డారు.  బూతులో క్యూలైన్లో ఉన్నవారిని ఓటు వేయాల్సిందిగా కోరడంతో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి పై ఆత్మకూరు టౌన్ సీఐ లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైదుకూరు వైసీపీ ఎంఎల్ఏ అభ్యర్థి రఘురామిరెడ్డి టీడీపీ ఏజెంట్​పై దాడికి పాల్పడ్డాడని పోలీసులు హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ  కేసు పెట్టారు. 

హెలికాప్టర్​లో ఈవీఎంల తరలింపు

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజవర్గంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల నుంచి ఈవీఎం, వీవీ ప్యాట్లను హెలికాప్టర్​లో రంపచోడవరంలోని స్ట్రాంగ్ రూమ్​కు తరలించారు.

ప్రశాంతంగా పోలింగ్​: ఈసీ 

పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. 78 శాతం పోలింగ్​ నమోదైందని చెప్పారు. ఇంకా పోలింగ్​ కొనసాగుతోందని పూర్తి వివరాలు మంగళవారం వెల్లడిస్తామన్నారు. అక్కడక్కడా చోటుచేసుకున్న ఘర్షణలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తెనాలి, పల్నాడు, నరసరావుపేట, మాచర్ల, అనంతపురంలో జరిగిన ఘటలకు బాధ్యులైన వారిని వెంటనే గృహ నిర్బంధం చేయడంతో పాటు కేసులు పెట్టామని చెప్పారు.

ఒకటి రెండు చోట్లు ఈవీఎంలు ధ్వంసం చేసినప్పటికీ వాటిలో ఉండే చిప్ కు ఎలాంటి డ్యామేజీ కాలేదని..అందులో సమాచారం  సురక్షితంగానే ఉందని చెప్పారు. ఘటనలపై పూర్తిగా రివ్యూ చేసిన తర్వాత ఎక్కడైనా రీపోలింగ్ జరపాల్సిన అవసరం ఉంటే వెల్లడిస్తామని అన్నారు.