కరీంనగర్‌‌ జిల్లాలో రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తుల వెల్లువ

కరీంనగర్‌‌ జిల్లాలో రాజీవ్ యువ వికాసానికి  దరఖాస్తుల వెల్లువ
  • ఏడేళ్ల తర్వాత నిరుద్యోగులకు స్వయం ఉపాధి స్కీమ్
  • ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,44,640 అప్లికేషన్లు

కరీంనగర్‌‌/పెద్దపల్లి, వెలుగు: యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్‌ యువ వికాసం స్కీమ్‌కు ఉమ్మడి కరీంనగర్‌‌ జిల్లావ్యాప్తంగా అనూహ్య స్పందన లభించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,44,640 దరఖాస్తులు రాగా, పెద్దపల్లి జిల్లాలో 47,470, కరీంనగర్‌ జిల్లాలో 42,565, జగిత్యాల జిల్లాలో 31,128,  రాజన్నసిరిసిల్ల జిల్లాలో 23,477 అప్లికేషన్లు వచ్చాయి. తొలుత రేషన్ కార్డు, ఇన్ కం సర్టిఫికెట్ తప్పనిసరి అని ప్రకటించడంతో కొందరు నిరాశకు లోనయ్యారు. తర్వాత నిబంధనలు సడలించడంతో వేలాది మంది అప్లై చేసుకున్నారు. ప్రభుత్వం రూ.50 వేల నుంచి  రూ.4 లక్షల వరకు యూనిట్లు మంజూరు చేయనుండటంతో ఆర్థిక సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.  

ఏడేళ్ల తర్వాత స్వయం ఉపాధి లోన్లు

హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎస్సీ ఉద్యోగ, నిరుద్యోగులకు దళితబంధు, అసెంబ్లీ ఎన్నికల ముందు కొందరికి బీసీ బంధు మినహా జిల్లాలో గత ఏడేళ్లలో పెద్దగా స్వయం ఉపాధి స్కీం అమలు చేయలేదు. సుదీర్ఘ కాలం తర్వాత నిరుద్యోగుల కోసం స్వయం ఉపాధి పథకాన్ని అమలు చేస్తుండటంతో వేలాది మంది నిరుద్యోగులు, చిరు వ్యాపారులు ఈ స్కీమ్ పైనే ఆశలు పెట్టుకున్నారు.  మార్చి 25న ఈ పథకం విధివిధానాలపై సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. ఆ తరువాత ఈబీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరణ చేపట్టింది. గడవు పెంచుతూ 14వరకు సమయం ఇచ్చింది. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా అప్లికేషన్ ఫామ్ తోపాటు క్యాస్ట్, ఇన్ కం, రేషన్ కార్డు తదితర సపోర్టింగ్ డాక్యుమెంట్లను స్థానిక మున్సిపల్, ఎంపీడీఓ ఆఫీసుల్లో సమర్పించాలని అధికారులు వెల్లడించారు. 

పెద్దపల్లి  జిల్లాలో అధికంగా...

పెద్దపల్లి జిల్లాలో రాజీవ్ యువ వికాసం స్కీమ్‌ కింద 47,470 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్‌కు 12,782 మంది, ఎస్టీ  కార్పొరేషన్ 934 మంది, బీసీ కార్పొరేషన్‌కు 30,091, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ కు 2,729 మంది, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ కు 72 మంది, ఈబీసీలు 862 మంది అప్లై  చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాలో 42,565 దరఖాస్తులు రాగా ఇందులో ఎస్సీ కార్పొరేషన్ 13,365, బీసీ కార్పొరేషన్, ఈబీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు కలిపి 28 వేలు, ఎస్టీ కార్పొరేషన్ కు 1200 దరఖాస్తులు అందాయి. రాజన్నసిరిసిల్ల జిల్లాలో 23,477 దరఖాస్తుల్లో ఎస్సీ కార్పొరేషన్ కు  5,946 మంది, ఎస్టీ  కార్పొరేషన్ 1,264 మంది, బీసీ కార్పొరేషన్ కు 14,807, ఈబీసీలు 632 మంది, మైనార్టీ కార్పొరేషన్ కు 828 మంది, జగిత్యాల జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్‌కు 22,415 మంది, ఎస్టీలు1437 మంది, బీసీలు 30,054 , మైనార్టీలు 3,999మంది ఈబీసీ లు 1,074 మంది దరఖాస్తు చేసుకున్నారు.

పెద్దపల్లి          47,470
కరీంనగర్‌        42,565 
జగిత్యాల        31,128
రాజన్నసిరిసిల్ల    23,477