ఏపీలో ఘోరం: సిమెంట్ లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి..

ఏపీలో ఘోరం: సిమెంట్ లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి..

ఏపీలోని ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది... గురువారం ( మార్చి 6, 2025 ) తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా... 15 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. ఏలూరు జిల్లా సోమవరప్పాడు దగ్గర జరిగింది ఈ ప్రమాదం. వేగంగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సిమెంట్ లారీని వెనక నుంచి ఢీకొనడంతో బస్సు నుజ్జు నుజ్జయ్యింది.

ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. గాయపడ్డ 15 మందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రహదారిపై ట్రాఫిక్ జాం అయ్యింది.