
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 12, 13 ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. షెడ్యూల్ ప్రకారం కాకుండా పలు రైళ్లు ఆలస్యంగా నడవటంతో ఒక్కసారిగా ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో కాసేపు రైల్వే స్టేషన్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు అయోమాయానికి గురయ్యారు. శివగంగా ఎక్స్‌ప్రెస్, మగధ్ ఎక్స్‌ప్రెస్, స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్, లక్నో మెయిల్ ట్రైన్లు ఆలస్యం కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
ALSO READ | MS Dhoni: 51 ఏళ్ళ వరకు ఆడతాడు.. ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
వేలాది మంది ప్రయాణికులు తమ రైళ్ల కోసం వేచి ఉండటంతో ప్లాట్‌ఫామ్‌లు కిక్కిరిసిపోయాయి. కుంభమేళా సమయంలో ఇదే రైల్వే స్టేషన్లో తొక్కి సలాట జరిగింది. తొక్కిసలాటలో 18 మంది మరణించగా.. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. ఆ ఘటనను దృష్టిలో పెట్టుకుని వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తక్షణ రద్దీ నియంత్రణ చర్యలను తీసుకున్నారు.
మరోసారి తొక్కి సలాట జరగకుండా రద్దీని నియంత్రించారు. దీనిపై రైల్వే మంత్రిత్వ శాఖ స్పందించింది. రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరగలేదని.. అలాంటి పరిస్థితి కూడా లేదని స్పష్టం చేసింది. ‘‘న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో భారీ రద్దీ ఉంది. తొక్కిసలాట లేదా తొక్కిసలాట లాంటి పరిస్థితి లేదు. రిజర్వేషన్ లేని ప్రయాణీకులను అధికారులు హోల్డింగ్ ప్రాంతం గుండా తీసుకెళ్లే ప్రోటోకాల్‌ను ఉపయోగిస్తున్నారు’’ అని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.