![వడ్ల ట్రాన్స్ పోర్ట్ లో రైతులకు టోకరా!](https://static.v6velugu.com/uploads/2025/02/contractors-cheat-farmers-in-paddy-transportation-scheme_9naOoF0lhb.jpg)
- కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపునకు కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తున్న ప్రభుత్వం
- ముందస్తు ఒప్పందం మేరకు లారీల్లో కాకుండా సొంతంగా ట్రాక్టర్లలో వడ్లు తరలించిన కొందరు రైతులు
- తర్వాత రవాణా ఛార్జీల గురించి నిలదీస్తే పట్టించుకోని కాంట్రాక్టర్లు
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.కోట్లలో దందా
- కేంద్రాల నిర్వాహకులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు
హనుమకొండ, వెలుగు: కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించాల్సిన కాంట్రాక్టర్లు అన్నదాతలను నిలువునా ముంచుతున్నారు. ధాన్యాన్ని మిల్లులకు చేరవేయడం కోసం ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ట్రాన్స్ పోర్ట్ ఛార్జీలు చెల్లిస్తున్నా.. వివిధ కారణాలతో రైతులే వడ్లను తరలించుకునేలా చేస్తున్నారు.
అలా సొంతంగా వడ్లను ట్రాన్స్ పోర్ట్ చేసుకున్న వారికి సంబంధిత కాంట్రాక్టర్లు ట్రక్ షీట్ ప్రకారం అమౌంట్ చెల్లించాల్సి ఉండగా, సదరు కాంట్రాక్టర్లు రైతులకు మొండిచేయి చూపుతున్నారు. దీంతో ఆరుగాలం శ్రమించిన రైతులకు దక్కాల్సిన ఫలితం కాస్త అధికారులు, కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండగా, ఆఫీసర్లు అన్నీ తెలిసీ లైట్ తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రైతులే తరలించుకునేలా ప్లాన్
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే బాధ్యతను ప్రభుత్వం కాంట్రాక్టర్లు అప్పగించింది. కానీ లారీల కొరత, వర్షాలు, అన్ లోడ్ సమస్యలను సాకుగా చూపి.. ధాన్యం తరలింపులో కాంట్రాక్టర్లు అలసత్వం చూపుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని సంబంధిత మిల్లులకు చేరవేసుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉండగా, ట్రాన్స్ పోర్ట్ ఛార్జీల పేరున మోసం జరుగుతోంది.
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని తరలించేందుకు ప్రతి మూడు మండలాలను ఒక సెక్టార్ గా విభజించి, ఒక్కో సెక్టార్ కు ఒక్కో కాంట్రాక్టర్ కు ప్రభుత్వం తరలింపు బాధ్యతలు అప్పగించింది కొనుగోలు కేంద్రం నుంచి దూరాన్ని బట్టి ట్రాన్స్ పోర్ట్ ఛార్జ్ చెల్లిస్తుంటుంది.
కానీ చాలాచోట్లా వివిధ కారణాల వల్ల రైతులే సొంతంగా ధాన్యాన్ని తరలించుకుంటుండగా, వారి నుంచి ట్రక్ షీట్ కు తీసుకుంటున్న కాంట్రాక్టర్లు తామే వడ్లను మిల్లులకు చేరవేసినట్లు చూపుతున్నారు. రైతులు సొంతంగా ట్రాన్స్ పోర్ట్ చేసుకుంటే సంబంధిత ఛార్జీలను ట్రక్ షీట్ల ప్రకారం కాంట్రాక్టర్లు అన్నదాతలకే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అన్నదాతలకు దక్కాల్సిన ట్రాన్స్ పోర్ట్ ఛార్జీలు కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలో రూ.కోట్లలో దందా
ట్రాన్స్ పోర్ట్ ఛార్జీల పేరున ప్రతి సీజన్ లో కాంట్రాక్టర్లు రూ.కోట్లతో దందా చేస్తున్నారు. వానాకాలం సీజన్ లో హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో మొత్తంగా 146 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా ఓవరాల్ గా 22,780 మంది రైతుల నుంచి 96,619 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు.
కొనుగోలు చేసిన 96,619 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ముందుగా గుర్తించిన ప్రకారం జిల్లాలోని 50 మిల్లులకు తరలించారు. ఇంతవరకు బాగానే ఉండగా వర్షాలు, లారీల కొరత, తదితర కారణాల వల్ల అందులో దాదాపు 20 శాతం ధాన్యాన్ని రైతులే మిల్లులకు తరలించినట్లు తెలుస్తోంది. సుమారు 20 వేల టన్నుల వరకు ట్రాక్టర్ల ద్వారా తరలినట్లు రైతులు చెబుతున్నారు.
ఇదిలాఉంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో 6.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయగా, అందులో కనీసం 20 శాతం వరకు రైతులే ట్రాక్టర్ల ద్వారా మిల్లులకు చేరవేసినట్లు రైతుల ద్వారా తెలుస్తోంది. కనీస శ్లాబ్ రేట్ ప్రకారం క్వింటాకు రూ.32 చొప్పున లెక్కేసినా సుమారు రూ.21.9 కోట్ల వరకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీల పేరున కాంట్రాక్టర్లు నొక్కేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల కాంట్రాక్టర్లు క్వింటాకు రూ.15 చొప్పున చెల్లించి చేతులు దులుపుకొంటుండగా, మిగతా చోట్లా ఆ కాస్త కూడా ఇవ్వడం లేదని బాధిత రైతులు వాపోతున్నారు.
ఇందులో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఈ దందాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా శ్లాబ్ రేట్లు ఉంటుండగా, పెద్ద ఎత్తున నిధుల గోల్ మాల్ జరిగిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని రైతుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ట్రాక్టర్ల ద్వారానే తీసుకెళ్లినం
మేం పండించిన వడ్లను ట్రాక్టర్ ద్వారానే మిల్లుకు తీసుకెళ్లినం. దానికి సంబంధించిన డబ్బులు ఇస్తానని కాంట్రాక్టర్ చెప్పాడు. కానీ ఎన్నిసార్లు అడిగినా స్పందించడం లేదు. గట్టిగా నిలదీస్తే రేపు, మాపు అంటూ కాలం వెల్లదీస్తున్నాడు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండటం లేదు. - రవీందర్, కమలాపూర్, హనుమకొండ జిల్లా
ఇంతవరకు మా దృష్టి రాలేదు
కొనుగోలు కేంద్రాలపై ప్రతిరోజు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాం. లారీలు పెట్టడం లేదనే విషయంపై మాకు ఫిర్యాదు ఎక్కడా రాలేదు. రైతులు సొంతంగా ట్రాక్టర్ల ద్వారా తరలించుకున్నట్లు ఇంతవరకు మా దృష్టికి రాలేదు. ఒకవేళ ఒరిజినల్ ట్రక్ షీట్లు పట్టుకుని అధికారులను సంప్రదిస్తే ట్రాన్స్ పోర్ట్ ఛార్జీలు ఇప్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. - మహేందర్, సివిల్ సప్లయిస్ డీఎం, హనుమకొండ