
- గతంలో దొడ్డు బియ్యం తీసుకునేందుకు ఆసక్తి చూపని లబ్ధిదారులు
- ప్రస్తుతం సన్న బియ్యం కోసం రేషన్‌షాపుల ఎదుట క్యూ
- మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో 8 లక్షల కార్డులపై 17,019 టన్నుల బియ్యం అదనం
- మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కార్డులకు మించి బియ్యం పంపిణీ
కరీంనగర్, వెలుగు : గతంలో ప్రభుత్వం ఇచ్చే దొడ్డు బియ్యం తీసుకునేందుకు ఆసక్తి చూపని లబ్ధిదారులు ప్రస్తుతం సన్నబియ్యం ఇస్తుండడంతో రేషన్ షాపుల వద్ద క్యూ కడుతున్నారు. ఈ నెల 1న రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభం కాగా.. మొదటి 10 రోజుల్లోనే 70 శాతం బియ్యం పంపిణీ పూర్తయింది. ఆ పది రోజులు లబ్ధిదారులతో రేషన్‌షాపులు కిక్కిరిశాయి. శనివారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 89 శాతం మంది లబ్ధిదారులు బియ్యం తీసుకెళ్లారు. సన్న బియ్యానికి పేదల నుంచి అనూహ్య స్పందన వస్తుండడంతో చివరి లబ్ధిదారుడి వరకు బియ్యం పంపిణీ చేసేందుకు డీలర్లు షాపులు తెరిచే ఉంచుతున్నారు.
ఇప్పటివరకు 89 శాతం పంపిణీ పూర్తి
రాష్ట్రంలో మొత్తం 90,40,196 రేషన్ కార్డులు ఉండగా 2,85,19,495 మంది లబ్ధిదారులుగా నమోదయ్యారు. గతంలో ప్రతి నెల గరిష్టంగా 77.50 లక్షల కార్డులకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని మాత్రమే లబ్ధిదారులు తీసుకెల్లారు. దొడ్డు బియ్యం తీసుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపకపోవడంతో ప్రతి నెలా సుమారు 13 లక్షల కార్డులకు సంబంధించిన రేషన్ బియ్యం మిగిలిపోయేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ ప్రారంభించడంతో ఈ బియ్యాన్ని తీసుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపుతున్నారు.
సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైన నాటి నుంచి 19వ తేదీ వరకు 80,27,290 కార్డులకు సంబంధించిన 1,67,017 టన్నుల బియ్యాన్ని లబ్ధిదారులు తీసుకెళ్లారు. మార్చిలో ఇదే తేదీ వరకు 72,50,906 కార్డుదారులు 1,49,998 టన్నుల బియ్యాన్నే తీసుకెళ్లడం గమనార్హం. గత నెలతో పోలిస్తే ప్రస్తుత నెలలో 8 లక్షల కార్డులకు 17,019 టన్నుల బియ్యం అదనంగా పంపిణీ జరిగింది. ఇప్పటివరకు 89 శాతం పంపిణీ పూర్తికాగా నెలాఖరు నాటికి 95 శాతం మంది రేషన్ బియ్యాన్ని తీసుకెళ్లొచ్చని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.
మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కార్డులకు మించి బియ్యం పంపిణీ
రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఇప్పటివరకు 85 శాతం నుంచి 95 శాతం కార్డులకు సన్నబియ్యం పంపిణీ జరిగింది. కానీ మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం ఉన్న కార్డులకు మించి బియ్యం పంపిణీ జరగడం విశేషం. ఐరిష్, బయోమెట్రిక్ ఆధారంగా రాష్ట్రంలో ఎక్కడినుంచైనా రేషన్ బియ్యాన్ని తీసుకునే వెసులుబాటు ఉంది. దీంతో ఉపాధి కోసం ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వారు స్థానికంగా ఉన్న రేషన్ షాపుల్లోనే బియ్యాన్ని తీసుకుంటున్నారు.
దీంతో మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో బియ్యం తీసుకునే వారి సంఖ్య పెరిగింది. మేడ్చల్ జిల్లాలో మొత్తం 5,28,881 కార్డులు ఉండగా ఇప్పటివరకు 5,90,237 కార్డులకు సంబంధించిన బియ్యం తీసుకున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లాలో 5,71,696 కార్డులు ఉండగా 6,02,395 కార్డులపై బియ్యం తీసుకున్నారు. ఈ రెండు జిల్లాల్లో గత నెలలో బియ్యం పంపిణీ లెక్కలను పరిశీలిస్తే అసలు కార్డుల కంటే తక్కువగానే బియ్యం పంపిణీ జరిగింది.