తెలంగాణలో భారీగా ఐఏఎస్‎ల బదిలీలు.. ఆమ్రపాలి స్థానంలో ఎవరొచ్చారంటే..?

హైదరాబాద్: తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 2024, నవంబర్ 11వ తేదీన 13 మంది ఐఏఎస్ ఆఫీసర్లను ప్రభుత్వం ట్రాన్స్‎ఫర్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఐఏఎస్ కాటా ఆమ్రపాలి ఏపీ కేడర్‎కు వెళ్లిపోవడంతో ఖాళీ అయిన జీహెచ్ఎంసీ కమిషనర్ పోస్టును ప్రభుత్వం సీనియర్ ఆఫీసర్ ఇలంబర్తికి అప్పగించింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఇంచార్జ్ కమిషనర్‎గా ఉన్న ఇలంబర్తికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించింది. మరో డైనమిక్ ఆఫీసర్ స్మితా సబర్వాల్‎ను ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్ర పర్యాటకం, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ  కార్యదర్శిగా స్మిత సబర్వాల్‎ను నియమించింది. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో ఆమె అలాగే కొనసాగనున్నారు. 

బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఇ. శ్రీధర్ ను నియమించిన ప్రభుత్వం ఆయనకు దేవదాయ శాఖ కమిషనర్‎గా అదనపు బాధ్యతలు అప్పగించింది. మహిళ, శిశు సంక్షేమం, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అనిత రామచంద్రన్, ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవోగా శివశంకర్, రవాణ శాఖ కమిషనర్‎గా కే సురేంద్ర మోహన్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి డైరెక్టర్‎గా సృజన, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‎గా హరికిరణ్, ట్రాన్స్‌కో సీఎండీగా కృష్ణ భాస్కర్, ఆయుష్ డైరెక్టర్‌గా చిట్టెం లక్ష్మి, ఇంటర్మీడియట్ డైరెక్టర్‌గా కృష్ణ ఆదిత్య, లేబర్ కమిషనర్‌గా సంజయ్ కుమార్, జీఏడీ సెక్రటరీగా గౌరవ్ ఉప్పల్ ను ప్రభుత్వం నియమించింది. కృష్ణ భాస్కర్ ట్రాన్స్‌కో సీఎండీ బాధ్యతలతో పాటు డిప్యూటీ సీఎం ప్రత్యేక కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఇటీవల తెలంగాణ కేడర్‎కు చెందిన నలుగురు ఐఏఎస్‎లు ఏపీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బదిలీలు చేపట్టినట్లు తెలిసింది.