కామారెడ్డి రైతులను పోలీసులు ఇష్టమొచ్చినట్లు కొట్టిన్రు

  •      హెచ్‌ఆర్‌‌సీకి  కామారెడ్డి రైతుల ఫిర్యాదు 
  •      పోలీసులు దాడి చేసిన ఫొటోలు అందజేత

హైదరాబాద్‌, వెలుగు : మాస్టర్‌‌ ప్లాన్‌లో భూములు కోల్పోతున్న కామారెడ్డి రైతులు శుక్రవారం మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌‌సీ) ని ఆశ్రయించారు.‌ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన తమను పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని కమిషన్‌ కు ఫిర్యాదు చేశారు. సీఐ శ్రీనివాస్‌ గౌడ్‌, ఎస్‌ఐలు ప్రసాద్‌, రఘు కాళ్లతో తన్నారని, కిందపడేసి కొట్టారని ఆ ఫిర్యాదులో  పేర్కొన్నారు. రైతులకు అన్యాయం చేసిన కామారెడ్డి జిల్లా కలెక్టర్‌‌తో పాటు పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం బాధితులు మీడియాతో మాట్లాడారు. 

రైతులను మోసం చేసేలా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే  మాస్టర్‌‌ప్లాన్  ముసాయిదా తయారు చేశారని అన్నారు. స్థానిక నాయకులు, అధికారులు కలిసి తమ భూములు లాక్కోవడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. తమపై జరిగిన దాడికి సంబంధించిన ఫొటోలను కమిషన్ కు అందజేశామని చెప్పారు. బాధ్యులైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.