రైతుల పోరాటానికి తలవంచిన రాష్ట్ర సర్కార్

  • పోరాడి విజయం సాధించిన రైతన్నలు
  • ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని కొత్తగా మాస్టర్ ప్లాన్: మున్సిపల్ శాఖ
  • రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడి
  • మరో 70 మాస్టర్ ప్లాన్లపై సర్కారు వెనక్కి!

కామారెడ్డి/జగిత్యాల, వెలుగు:రైతుల పోరాటానికి రాష్ట్ర సర్కారు తలవంచింది. కామారెడ్డి, జగిత్యాలలో కొత్త మాస్టర్ ప్లాన్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతులు చివరికి విజయం సాధించారు. శుక్రవారం రెండు చోట్ల నిర్వహించిన మున్సిపల్ ప్రత్యేక సమావేశాల్లో మాస్టర్ ప్లాన్లను రద్దు చేస్తూ పాలకవర్గాలు ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్లలో విలీన గ్రామాలకు చెందిన భూములను ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్లలో చేర్చడం, పొలాల నుంచి 100 ఫీట్ల రోడ్లను ప్రతిపాదించడంపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తమ భూములను కాపాడుకునేందుకు రైతులు మడమతిప్పకుండా పోరాడారు. వారిని సముదాయించడానికి  ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. వెనక్కి తగ్గలేదు. మాస్టర్​ప్లాన్లను రద్దు చేసి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. 

కామారెడ్డి డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తూ మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. చైర్​పర్సన్ నిట్టు జాహ్నవి అధ్యక్షతన శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరిగింది. మున్సిపాలిటీ నుంచి 2021 మార్చి 27న తీర్మానం నంబర్​42/407 కింద డ్రాఫ్ట్ మాస్టర్​ప్లాన్ పంపగా.. ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ డిజైన్ డెవలప్​మెంట్ ఫోరమ్, డీటీసీపీ జాయింట్ డైరెక్టర్ రమేశ్​బాబు మార్పులు చేసి ప్రభుత్వానికి సమర్పించారని, రైతులకు, పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలిగినందున మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తున్నామని తీర్మానం చేశారు. కన్సల్టెన్సీ, డీటీసీపీ జాయింట్ డైరెక్టర్‌‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ మరో తీర్మానాన్ని ఆమోదించారు. బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మీర్జా హఫీజ్ బేగ్, బీజేపీ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అన్వర్ హైమద్ బలపరచగా.. కౌన్సిలర్లు అమోదించారు. మీటింగ్‌లో మాస్టర్ ప్లాన్ రద్దు అజెండా మాత్రమే ఉండడంతో సమావేశం 10 నిమిషాల్లోనే ముగిసింది. జగిత్యాలలో మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిగింది. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ ను రద్దు చేస్తూ కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మీటింగ్​లో ఎమ్మెల్యే సంజయ్ కూడా పాల్గొన్నారు. ఎవరికీ ఎలాంటి నష్టం లేకుండా కొత్త మాస్టర్ ప్లాన్ కోసం కమిటీ వేయాలని ఎమ్మెల్యే సంజయ్ ప్రతిపాదించగా.. తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.


తప్పంతా కన్సల్టెన్సీ, డీటీసీపీదే: కామారెడ్డి మున్సిపల్ చైర్​పర్సన్

రైతుల సంక్షేమం గురించే బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం ఆలోచిస్తుందని, అలాంటిది వారికి అన్యాయం చేయదని కామారెడ్డి మున్సిపల్ చైర్​పర్సన్ నిట్టు జాహ్నవి అన్నారు. కౌన్సిల్ మీటింగ్ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్ విషయంలో రైతులు, ప్రజలు ఆందోళన చెందవద్దని, రైతులకు నష్టం చేయాలనే ఉద్దేశం తమకు లేదని పేర్కొన్నారు. తాము పంపిన ప్లాన్​ను కన్సల్టెన్సీ, డీటీసీపీ జాయింట్ డైరెక్టర్​ మార్చడంవల్లనే రాద్ధాంతం జరిగిందని, తాము రెసిడెన్షియల్ జోన్​గా ప్రతిపాదించిన ఏరియాలను ఇండస్ట్రియల్ జోన్​గా మార్చారన్నారు. తాము మొదట పంపిన ప్లాన్​ను అమోదించాలని ఉన్నతాధికారులను కోరుతామన్నారు.

అందరితో మాట్లాడి కొత్త ప్లాన్: మున్సిపల్ శాఖ

మాస్టర్ ప్లాన్‌తో రైతుల భూములు సేకరించే ఉద్దేశం లేదని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పేర్కొన్నారు. రైతుల భూములు ఎక్కడికీ పోవని చెప్పారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పక్రియను నిలిపివేస్తున్నామని తెలిపారు. శుక్రవారం కామారెడ్డి జిల్లాకు వచ్చిన ఆయన కలెక్టరేట్​లో కలెక్టర్ జితేశ్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్​దొత్రే, మున్సిపల్ కమిషనర్ దేవేందర్‌‌తో సమావేశమయ్యారు. ముసాయిదా మాస్టర్ ప్లాన్ పక్రియపై రైతులు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలపై చర్చించారు. 

మిగతా ప్లాన్లపై యూటర్న్

హైదరాబాద్, వెలుగు: మాస్టర్ ప్లాన్లపై రాష్ట్ర సర్కార్ వెనక్కి తగ్గింది. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటం, ఎలక్షన్ ఇయర్ కావడంతో ఎక్కడ ఇబ్బంది వస్తుందోనని ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఇప్పటికే రిలీజ్ చేసిన కామారెడ్డి, జగిత్యాల డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్లను అక్కడి మున్సిపల్ కౌన్సిల్స్ రద్దు చేస్తూ తీర్మానం పాస్​ చేసుకున్నాయి. ప్రజల నుంచి నిరసనలు వస్తుండటంతో.. ప్రజాభిప్రాయ సేకరణకు త్వరలోనే రిలీజ్​ చేయనున్న మరో 70 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల మాస్టర్ ప్లాన్లను ఇప్పుడే తీసుకురావొద్దని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అధికార పార్టీ నేతలు చెప్పినట్లే మాస్టర్ ప్లాన్లు తయారు చేసి డ్రాఫ్ట్ రిలీజ్​ చేస్తుండటంతోనే సమస్యలు వస్తున్నాయి. మరోవైపు మాస్టర్ ప్లాన్లు రెడీ అవుతున్న మరో 68 పట్టణాలకు సంబంధించి కూడా ఆచితూచి వ్యవహరించాలని.. తొందరేం లేదని ఉన్నతాధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది.

ఇది రైతన్నల విజయం: సంజయ్​

హైదరాబాద్, వెలుగు: కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్ల రద్దుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది రైతన్నలు పోరాడి సాధించిన విజయమని చెప్పారు. రైతుల ఉద్యమ స్ఫూర్తికి శుక్రవారం ఓ ప్రకటనలో అభినందనలు తెలిపారు. బీఆర్ఎస్ సర్కార్‌‌ను తరిమికొట్టేదాకా ఇదే ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. ‘‘కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు పోరాటంలో నేను పాల్గొన్నాను. నాతోపాటు ఎంతోమంది బీజేపీ కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారు. మాపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఎన్ని నిర్బంధాలు, మరెన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడలేదు” అని చెప్పారు.