ఫీల్డింగ్ సెట్ చేసి వెంటనే ఫలితాలు రాబట్టాలంటే టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకే సాధ్యం. ఎన్నో సందర్భాల్లో తన మాస్టర్ మైండ్ తో అనుకూల ఫలితాలు రాబట్టి ఆశ్చర్యానికి గురి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ధోనీ మాదిరి న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియంసన్ తన సూపర్ కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. గాలే వేదికగా ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఈ సంఘటన చోటు చేసుకుంది.
నాలుగో రోజు ఆటలో భాగంగా శ్రీలంక ఆటగాడు చండీమల్ హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. 61 పరుగులు చేసి జోరు మీదున్న అతనిని విలియంసన్ తన మాస్టర్ మైండ్ తో బోల్తా కొట్టించాడు. విలియం ఒరోర్కే బౌలింగ్ లో కవర్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న లాతమ్ ను స్క్వేర్ లెగ్ పక్కకు పంపించాడు. ఆ తర్వాత ఒరోర్కే బంతిని లెగ్ సైడ్ వేయగా చండీమల్ ఫైన్ లెగ్ వైపు ఫ్లిక్ చేశాడు. ఇది వెళ్లి అక్కడ ఫీల్డర్ చేస్తున్న లాతమ్ చేతుల్లో పడింది. అప్పటికప్పుడు విలియంసన్ తీసుకున్న ఈ నిర్ణయం ఒక్కసారిగా ధోనీని గుర్తు చేసింది.
ALSO READ | IND vs BAN 2024: ఓటములను దాటిన విజయాలు.. టెస్ట్ క్రికెట్‌లో భారత్ అరుదైన రికార్డ్
ఈ టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 305 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 340 పరుగులు చేసి 35 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక 309 పరుగులకు ఆలౌటైంది. 275 పరుగుల లక్ష్యంతో దిగిన న్యూజిలాండ్ ప్రస్తుతం 3 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. మిచెల్(7), రచీన్ రవీంద్ర (17) క్రీజ్ లో ఉన్నారు. న్యూజిలాండ్ గెలవాలంటే మరో 185 పరుగులు కావాలి.