- ఇప్పటికే ముగ్గురు ఏజెంట్లు అరెస్ట్
- ప్రధాన నిందితుడు అలమ్ రిమాండ్
హైదరాబాద్, వెలుగు: విదేశాల్లో ఉద్యోగం పేరుతో యువతను సైబర్ నేరాల వైపు మళ్లిస్తున్న కాంబోడియా ఏజెంట్ ను రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అరెస్ట్ చేసింది. ప్రధాన నిందితుడైన షాదాబ్ అలమ్ ఈ నెల10న ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చింది. శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించింది. ఈ కేసు వివరాలను సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ శనివారం వెల్లడించారు.
కాంబోడియాలో చైనీస్ కాల్ సెంటర్..
సిరిసిల్లకు చెందిన ఓ యువకుడు విదేశాల్లో ఉద్యోగం కోసం యత్నించాడు.ఈ క్రమంలో జగిత్యాలకు చెందిన ఏజెంట్ కె. సాయి ప్రసాద్ సహాయంతో ఫుణెలోని బిహార్‌కు చెందిన ఏజెంట్స్ మహ్మద్ అబిద్ అన్సారీ, మహ్మద్ షాదాబ్ అలమ్, సదాకత్‌ను కలిశాడు. వీరంతా యువకుని వద్ద రూ.1.4లక్షలు వసూలు చేసి కాంబోడియాకు పంపించారు. స్థానికంగా చైనా సైబర్ నేరగాళ్లు నిర్వహించే కాల్ సెంటర్‌లో ఉద్యోగం ఇప్పించారు. యువకుని పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు. రోజుకు16 నుంచి 17 గంటల పాటు వర్క్ చేయించారు. ఆన్‌లైన్‌లో ప్రతి రోజు 500 నుంచి 600 మంది ఇండియన్స్ టార్గెట్‌గా సైబర్ నేరాలు చేయించారు.
చిత్రహింసలకు గురిచేసి..
కాల్ సెంటర్ నుంచి పారిపోకుండా నిఘా పెట్టేవారు. సైబర్ నేరాల గురించి ప్రశ్నించినా వారి చెప్పిన పనులు చేయకపోయినా చిత్రహింసలకు గురిచేసేవారు. ఇదంతా బాధితుడు (సిరిసిల్ల యువకుడు) తన తల్లికి వివరించాడు. దీంతో ఆమె మే 16న సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు ఫిర్యాదు చేసింది. కేసును దర్యాప్తు చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఏజెంట్స్ సాయి ప్రసాద్, బిహార్ ఏజెంట్ అబిద్ అన్సారీని అరెస్ట్ చేసి విచారించారు. కాంబోడియాలో ఉన్నట్టు గుర్తించారు. విదేశాంగ శాఖకు సమాచారం అందించారు. మే చివరి వారంలో బాధిత యువకుడిని రాష్ట్రానికి రప్పించారు. ప్రధాన నిందితుడు షాదాబ్ అలమ్‌ను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ ఇంకా ఎంత మందిని కాంబోడియా తరలించారనేది తేల్చేందుకు కస్టడీకి తీసుకుని విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.