- క్వింటాలుకు రూ.500 ఎక్కువ ఇస్తున్న అక్కడి వ్యాపారులు
- వడ్లు రాక వెలవెలబోతున్న కొనుగోలు కేంద్రాలు
గద్వాల, వెలుగు: జిల్లాలోని వడ్లకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో పక్కనే ఉన్న కర్నాటకలో ఎక్కువ రేటు పలుకుతోంది. దీంతో నడిగడ్డలో పెద్ద మొత్తంలో వడ్లు పక్కనే ఉన్న కర్నాటక రాష్ట్రానికి తరలిపోతున్నాయి. రాష్ట్రంలో వడ్లకు మద్దతు ధర రూ.2,200 ఉంది. కర్నాటకతో పాటు బహిరంగ మార్కెట్ లో క్వింటాల్ వడ్లకు రూ.2,700 నుంచి రూ.2,800 పలుకుతుండడంతో రైతులంతా అక్కడే అమ్ముకుంటున్నారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు వడ్లు లేక వెలవెలబోతున్నాయి. 10 రోజుల కింద జిల్లాలో 64 కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయగా, ఇప్పటి వరకు ఒక్క క్వింటాలు కూడా కొనుగోలు చేయలేదంటే బయట మార్కెట్ లో వడ్లకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
1,51 లక్షల క్వింటాళ్లు వస్తాయని అంచనా..
జోగులాంబ గద్వాల జిల్లాలో 50,600 ఎకరాల్లో వరి సాగు చేయగా, 1,51,800 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు. మార్కెట్కు 1,21,400 క్వింటాళ్ల వడ్లు వస్తాయని భావించారు. వీటిని కొనుగోలు చేసేందుకు ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా ద్వారా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లాలో అన్ని చోట్ల సెంటర్లు ఓపెన్ చేసినా వడ్లు కేంద్రాలకు రాలేదు.
నడిగడ్డ నుంచి కర్ణాటకకు..
నడిగడ్డ రైతులు కొంతకాలంగా కర్నాటకలో తమ పంట దిగుబడులను అమ్ముకుంటున్నారు. పత్తి, వడ్లు ఇలా ఏ పంటనైనా నేరుగా కర్నాటక మార్కెట్కు తీసుకెళ్లడమో లేదంటే అక్కడి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేయడమో చేస్తున్నారు. ఈసారి అక్కడ వడ్లకు డిమాండ్ బాగా ఉండడం, ఇక్కడి కంటే రూ.500 నుంచి రూ.600 వరకు రేటు ఎక్కువగా ఉండడంతో జిల్లాలోని గట్టు, ధరూర్, కేటిదొడ్డి మండలాల రైతులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కర్నాటకకు తరలిస్తున్నారు. గతంలో పత్తి అమ్ముకోవాలంటే ఇక్కడి రైతులు తప్పనిసరిగా కర్నాటకకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఈసారి వడ్ల రైతులు కూడా పక్క రాష్ట్రానికి వెళ్లడం గమనార్హం.
రైస్ మిల్లర్లకు వడ్లు కరువు..
జిల్లాలో 60 కి పైగా రైస్ మిల్లులున్నాయి. కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన వడ్లను రైస్ మిల్లులకు తరలించి బియ్యం ఆడించేవారు. కానీ, ఈసారి కొనుగోలు కేంద్రాలకు వడ్లు రాకపోవడంతో రైస్ మిల్లర్లకు వడ్లు కరువయ్యాయి. దీంతో రైస్ మిల్లుల ఓనర్లు పరేషాన్ లో పడ్డారు. రెండేండ్ల నుంచి వడ్లు తక్కువగా వస్తున్నప్పటికీ, మెదక్ జిల్లా నుంచి సివిల్ సప్లై ఆఫీసర్లు వడ్ల తెప్పించి ఇక్కడి రైస్ మిల్లులకు ఇచ్చేవారు. ఈసారి మొత్తానికి వడ్లు లేకపోవడంతో అదే స్థాయిలో వడ్లు ఇతర జిల్లాల నుంచి సర్దుబాటు చేస్తారా? లేదా అని ఆందోళన చెందుతున్నారు. తమకు వడ్లు కేటాయించాలని కోరుతూ ఇప్పటికే సివిల్ సప్లై వినతిపత్రం అందించారు.
ఇప్పటి వరకు వడ్లు రాలే..
వడ్లు కొనుగోలు చేసేందుకు జిల్లాలో 64 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు వడ్లు రాలేదు. బయట మార్కెట్ లో రేటు ఎక్కువగా ఉండడమే కారణం. ఈ నెల లాస్ట్ వీక్ నుంచి వడ్లు వస్తాయని భావిస్తున్నాం.
- విమల, సివిల్ సప్లై డీఎం