వేరే కులం పేరుతో కుల పత్రం.. తెలంగాణలో మాంగ్ కులం పరిస్థితి ఇది..

వేరే కులం పేరుతో కుల పత్రం.. తెలంగాణలో మాంగ్ కులం పరిస్థితి ఇది..

తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్డ్  కులాల జాబితాలో పేర్కొన్న (59) కులాల్లో మాంగ్  కులం ఒకటి.  వీరి మాతృభాష మరాఠీ. గౌరవంగా ఒకరికొకరు శరణాత్ అని సంబోధించుకుంటారు. మాంగ్ సమాజ్ ప్రజలు ప్రధానంగా రాజస్తాన్ నుంచి కర్నాటక వరకు, ఒడిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు  దేశంలోని పదకొండు రాష్ట్రాలలో నివసిస్తున్నారు. తెలంగాణాలో నివసించేవారిలో దాదాపు 90% మంది కాయకష్టం చేసే నిరుపేదలు.

ఇప్పటికీ ఆర్డీఓ కార్యాలయం నుంచి కులం సర్టిఫికెట్ తీసుకోవడానికి మాంగ్ కులస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో  మాంగ్ కులం ప్రజలు నిరక్షరాస్యత, పేదరికం కారణంగా ఆర్డీవో కార్యాలయం నుంచి కులం సర్టిఫికెట్ పొందడంలో  ఎదురయ్యే ఇబ్బందులను భరించలేక, తహశీల్దార్ కార్యాలయం నుంచి కులం సర్టిఫికెట్ సులభంగా పొందడానికి అవకాశం ఉన్న కులం పేర్లతో కులంపత్రం పొంది, దానినే కొనసాగిస్తున్నారు.

ఇటీవల జరిగిన కులగణనలో  కూడా అదే పునరావృతం అయ్యింది.  ఈవిధంగా తప్పుగా కులపత్రం తీసుకున్నవారు భవిష్యత్తులో  ఇబ్బందులకు గురయ్యే ఆవకాశం ఉంది.  ఈ  సమస్యను పరిష్కరిస్తూనే, మాంగ్ కులపత్రం తహశీల్దార్ కార్యాలయం ద్వారా జారీ చేయాలనే  ప్రతిపాదనపై తగు సమాచారాన్ని పంపవల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను కోరింది. 

వేరే కులం పేరుతో కుల పత్రం
షెడ్యూల్డ్  కులాల్లో ప్రత్యేక వర్గాల ఉప వర్గీకరణ జరిగి, రిజర్వేషన్స్ ఫలాల్లో అందరితోపాటు మాంగ్ కులానికి కూడా తగు అవకాశాలు లభించి, అభివృద్ధిపథంలో రావడానికి అవకాశం ఉంటుందని ఏంతో  ఆశతో ఎదురుచూశాం. ఇటీవల  రాష్ట్ర ప్రభుత్వం, షెడ్యూల్డ్ కులాల్లోని ప్రత్యేక వర్గాల ఉప వర్గీకరణపై ఏర్పాటుచేసిన  ఏకసభ్య కమిషన్ సమర్పించిన నివేదికకు ఆమోదం తెలిపి,  మాంగ్ కులంను, అత్యంత వెనుకబడిన కులంగా గుర్తించి గ్రూప్-–1లో   చేర్చడం జరిగింది.

2011 జనాభా  లెక్కల ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో హిందూ,  సిక్కు,  బౌద్ధమతంను కలిపి మాంగ్ సమాజ్ ప్రజల మొత్తం జనాభా 13,365 గా నమోదైంది.  కానీ, నిజానికి మాంగ్​ సమాజ్ జనాభా లక్ష పైచిలుకు ఉంటుంది.  కులపత్రం వేరే  కులంపేరుతో తీసుకోవడం వలన జనాభా లెక్కలో నిజమైన కులం పేరును నమోదు చేయలేదు.  ప్రస్తుతం కమిషన్ వారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మాంగ్ కులం జనాభా 13,260 గా చూపెట్టారు. 

ప్రభుత్వం న్యాయం చేయాలి
ప్రస్తుతం జరుగుతున్న ఎస్సీ  ఉప వర్గీకరణలో మాంగ్ కులాన్ని గ్రూప్ 1 లో ఉంచడం  ఏ మాత్రం ప్రయోజనం కాదు. అది మాంగ్ కులానికి అత్యధికంగా నష్టంను కల్గించి, మాంగ్ కులం రెండు గ్రూపులు (కేటగిరి1, కేటగిరి 2)గా విభజనకు గురికావడమో లేదా  తెలంగాణాలో  తన అస్తిత్వాన్ని  కోల్పోవడమో జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే  ప్రస్తుతం తెలంగాణాలో  నివసించేవారిలో దాదాపు 80% మంది మాంగ్ సమాజ్ ప్రజలు 'మాదిగ కులం' ( Sl.No.31) పేరుతో  కులపత్రాలు తీసుకున్నారు.

9% రిజర్వేషన్ మూలంగా లభించే అధిక అవకాశాలు,  ప్రయోజనాలు పొందడం కోసం వారు గ్రూప్ –2లోనే కొనసాగితే,  ఒకవేళ గ్రూప్– 1లో ఉన్న మిగిలిన 20% మంది మాంగ్  ప్రజలు 1% రిజర్వేషన్ వలన సరైన అవకాశాలు పొందలేక మరింత వెనుకబాటుతనానికి గురవుతారు.

తెలంగాణాలో తమ ఉనికిను  కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు. ఏక సభ్య కమిషన్ వారికి మాంగ్ కులాన్ని ఎస్సీ ఉప వర్గీకరణలో  కేటగిరి-1 కిందికి చేర్చడాన్ని అభ్యంతరం తెలుపుతూ, మరొకసారి  పునఃపరిశీలనచేసి గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా మాంగ్ కులాన్ని మాదిగ కులం ఉన్న గ్రూప్-2లోకి మార్చి సరైన విధంగా సామాజిక న్యాయం చేయవలసిందిగా  కోరుతున్నాం.

గైక్వాడ్ తులసీదాస్ మాంగ్.. రాష్ట్ర అధ్యక్షుడు, మాంగ్ సమాజ్ తెలంగాణ