- ఈ సారి వర్షాలు మస్త్ కురుస్తయ్
- తిండికి, నీళ్లకు లోటు లేకుండా చూస్త
- లాల్ దర్వాజలో భవిష్యవాణి వినిపించిన మాతంగి అనురాధ
హైదరాబాద్, వెలుగు: రాబోయే కాలంలో విషజ్వరాలు వస్తాయి. కరోనా వచ్చింది.. పోయింది.. అలాంటివి ఇంకా వస్తాయి.. కానీ, భయపడకండి నేను అందరినీ కాపాడుకుంటా’ అని లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయం వద్ద మాతంగి అనురాధ భవిష్యవాణి వినిపించారు. హైదరాబాద్ఓల్డ్ సిటీ బోనాల ఉత్సవాల్లో భాగంగా లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయం వద్ద సోమవారం రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పచ్చి కుండపై నిల్చొని మాతంగి అనురాధ భవిష్యవాణి వినిపించారు. ‘ఈ సారి చేసిన పూజలకు ఆనందంగా ఉంది.
గ్రామ గ్రామాన నా పిల్లలు నాకు పూజలు చేస్తున్నందుకు నా బిడ్డల్ని నేను కాపాడుకుంటా. ఈ సారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. తిండికి, నీళ్లకు లోటు లేకుండా చూస్తా. ఇప్పుడు వచ్చే రోగాలను మీరే కొని తెచ్చుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. ఆలయాన్ని విశాలంగా నిర్మించేందుకు ఆటంకాలు ఏమీ లేవని, ఆలయాన్ని నిర్మించడం సంతోషమే అన్నారు. భక్తులు ఇంకా పెరుగుతారు కాబట్టి ఆలయాన్ని పెద్దగా నిర్మించడం మంచిదన్నారు. ఏ బాధ వచ్చినా నన్ను తలుచుకుంటే కాపాడుతానన్నారు.
5 వారాలు సాకలు, బొడ్రాయి పూజలు, పసుపు, బెల్లాలు ప్రసాదంగా నైవేద్యం పెట్టి ఐదోవారం రోజు నిండుబోనం, మారుబోనం ఎక్కించి సాగనంపండి అన్నారు. మహిళలు పసుపు కుంకుమతో ఉన్నంత కాలం ఈ దేశం సుభిక్షంగా ఉంటుందని, మహిళల మనసు నొప్పిస్తే నన్ను నొప్పించినట్టేనని మాతంగి అనురాధ భవిష్యవాణి వినిపించారు. కాగా, సాయంత్రం ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఓల్డ్ సిటీలో ఘటాల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు.