పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ టార్గెట్ 365 రన్స్. ఛేజింగ్‌లో ఆ జట్టు 76 రన్స్‌కే వికెట్లు కోల్పోయింది. మరో రోజంతా ఆట మిగిలుంది. ఇంకో 8 వికెట్లు తీస్తే రెండో టెస్టు గెలిచి ఇండియా సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తుందని.. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో కీలక పాయింట్లు సొంతం చేసుకుంటుందని ఆటగాళ్లతో పాటు అభిమానులూ ఆశించారు. కానీ, వారి ఆశలపై వాన దేవుడు నీళ్లు చల్లాడు. క్లీన్స్ పార్క్ ఓవల్‌ను వానతో ముంచెత్తాడు. దాంతో ఆఖరి, ఐదో రోజు ఆట ఒక్క బాల్ కూడా పడకుండా రద్దవగా, రెండో టెస్టు డ్రాగా ముగిసింది. తొలి మ్యాచ్‌లో గెలిచిన ఇండియా 1–0తో సిరీస్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 438 రన్స్ చేసిన రోహిత్‌సేన.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో విండీస్‌ను 255 స్కోరుకే ఆలౌట్ చేసింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను 24 ఓవర్లలో 181/2 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఇషాన్ కిషన్ (52 నాటౌట్) ఫిఫ్టీతో మెరిశాడు. ఛేజింగ్‌లో నాలుగో రోజు చివరకు వెస్టిండీస్ 76/2తో నిలిచింది. తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ (24 నాటౌట్), జర్మైన్ బ్లాక్‌వుడ్ (20 నాటౌట్) క్రీజులో నిలవగా.. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (28), క్రిక్ మెకెంజీ (0) వికెట్లు తీసిన అశ్విన్ టీమిండియా విజయానికి బాటలు వేశాడు. కానీ, నాలుగో రోజే ఓసారి పలుకరించిన వాన దేవుడు ఐదో రోజు ఇరు జట్లపై నీళ్లు కుమ్మరించాడు. లంచ్ బ్రేక్ తర్వాత వాన ఆగడంతో పిచ్, ఔట్ ఫీల్డ్ చెక్ చేసి అంపైర్లు ఇండియా టైమ్ ప్రకారం రాత్రి 10.45కి ఆట స్టార్ట్ చేయాలని నిర్ణయించారు. కానీ, మళ్లీ వాన రావడంతో రాత్రి12.20కి ఆట రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇషాన్ ధనాధన్
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో విండీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో టీ20 స్టయిల్ బ్యాటింగ్‌తో అలరించింది. తొలి వికెట్‌కు 98 రన్స్ జోడించిన తర్వాత ఓపెనర్లు రోహిత్ (57), యశస్వి (38) వెంటవెంటనే ఔటవగా వన్‌డౌన్ బ్యాటర్ గిల్ (29 నాటౌట్)కు తోడైన ఇషాన్ ధనాధన్ షాట్లు కొట్టాడు. అటు గిల్ సైతం స్పీడ్‌గా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో ఇషాన్ 33 బాల్స్‌లోనే తన టెస్టు కెరీర్లో తొలి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.
తర్వాత భారీ టార్గెట్ ఛేజింగ్‌కు వచ్చిన విండీస్ ఓపెనర్లు బ్రాత్‌వైట్, చందర్‌పాల్ ఇండియాకు భిన్నంగా పూర్తి డిఫెన్స్ చూపెట్టారు. ఇద్దరూ క్రీజులో పాతుకుపోయే ప్రయత్నం చేశారు. చివరకు 18వ ఓవర్లో టర్నింగ్ బాల్‌తో బ్రాత్‌వైట్‌ను ఔట్ చేసిన అశ్విన్ ఈజోడీని విడదీశాడు. తన తర్వాతి ఓవర్లోనే ఫ్లాట్, క్వీక్ బాల్‌తో మెకెంజీని డకౌట్ చేసి ఇండియా టీమ్‌లో జోష్ నింపాడు. కానీ, క్రీజులో పాతుకుపోయిన చందర్‌పాల్, బ్లాక్‌వుడ్ మరో వికెట్ పడకుండా రోజును ముగించారు.