పల్లెకెలె: ఆసియా కప్‌లో ఇండియా రెండో మ్యాచ్‌కు రెడీ అయ్యింది. గ్రూప్–ఎలో భాగంగా సోమవారం జరిగే మ్యాచ్‌లో పసికూన నేపాల్‌తో తలపడుతుంది. ఇందులో గెలిచి సూపర్–4 బెర్త్‌ను ఖాయం చేసుకోవాలని టీమిండియా టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే ఈ మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలి గించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ ఈ మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దయితే ఇండియా రెండు పాయింట్లతో సూపర్–4కు చేరే చాన్స్ ఉంది.
కానీ అంచనాలు తప్పి, డక్‌వర్త్ లూయిస్ లెక్కల్లో నేపాల్ గెలిస్తే మాత్రం టీమిండియాకు పరాభవం తప్పదు. ఈ మ్యాచ్ కోసం ఇండియా తుది జట్టులో పెద్దగా మార్పులు చేయడం లేదు. ఇషాన్ కిషన్‌ను లైనప్‌లో కిందకు పైకి మార్చే చాన్స్ కనిపిస్తున్నది. ఇక పేసర్ షమీకి అవకాశం ఇవ్వాలని భావిస్తోంది.
అయితే తొలి మ్యాచ్‌లో ఫెయిలైన రోహిత్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ భారీ స్కోర్లపై కన్నేశారు. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఓడిన నేపాల్.. ఇండియాకు షాకివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. లెగ్ స్పిన్నర్ సందీప్ లామిచానె, కెప్టెన్ రోహిత్ పౌడెల్ సంచలనంపై దృష్టి పెట్టారు.