RCB vs PBKS: ఆర్సీబీ అదే తీరు.. సొంతగడ్డపై మూడో మ్యాచ్‌‌లోనూ ఓటమి

RCB vs PBKS: ఆర్సీబీ అదే తీరు.. సొంతగడ్డపై మూడో మ్యాచ్‌‌లోనూ ఓటమి

బెంగళూరు: ఐపీఎల్‌‌18వ సీజన్‌‌లో  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వింతగా ఆడుతోంది. ప్రత్యర్థి వేదికల్లో ఆడిన నాలుగు మ్యాచ్‌‌ల్లోనూ గెలిచిన ఆర్సీబీ సొంతగడ్డపై ఇంకా గెలుపు రుచి చూడలేకపోయింది. చిన్నస్వామి స్టేడియంలో మూడో పోరులోనూ ఆ జట్టు పల్టీ కొట్టింది. శుక్రవారం (ఏప్రిల్ 18) రాత్రి వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌‌లో ఆల్‌‌రౌండ్ పెర్ఫామెన్స్‌‌తో ఆకట్టుకున్న  పంజాబ్ కింగ్స్‌‌ 5  వికెట్ల తేడాతో ఆర్సీబీని ఓడించి ఐదో విజయం ఖాతాలో వేసుకుంది.  

వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన పోరులో  టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన ఆర్సీబీ  95/9 స్కోరు చేసింది. టిమ్ డేవిడ్  (26 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 నాటౌట్‌‌) ఫిఫ్టీతో సత్తా చాటాడు. అతనితో పాటు కెప్టెన్ రజత్ పటీదార్ (18 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌‌‌, 1 సిక్స్‌‌తో 23) మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేయగా.. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌‌కు పరిమితం అయ్యారు. పంజాబ్ బౌలర్లలో మార్కో యాన్సెన్‌‌ (2/10), యుజ్వేంద్ర చహల్‌‌ (2/11), అర్ష్​దీప్ సింగ్‌‌ (2/23), హర్‌‌‌‌ప్రీత్‌‌ బ్రార్‌‌‌‌ (2/25) తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం పంజాబ్ 12.1 ఓవర్లలోనే 98/5 స్కోరు చేసి గెలిచింది. నేహల్ వాధెర (19 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 33 నాటౌట్‌‌) రాణించాడు. జోష్ హేజిల్‌‌వుడ్(3/14) మూడు, భువనేశ్వర్‌‌‌‌ (2/26) రెండు  వికెట్లు తీసినా ఫలితం లేకపోయింది.  టిమ్‌ డేవిడ్‌కు ప్లేయర్ ఆఫ్​ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

ఆదుకున్న డేవిడ్‌‌

సొంతగడ్డపై బెంగళూరు బ్యాటింగ్‌‌లో నిరాశపరిచింది. టిమ్ డేవిడ్ ఖతర్నాక్ ఇన్నింగ్స్‌‌తో ఆ మాత్రం స్కోరు చేసింది. టాస్ నెగ్గి బౌలింగ్‌‌ ఎంచుకున్న కెప్టెన్‌‌ శ్రేయస్ అయ్యర్ నిర్ణయానికి పంజాబ్ కింగ్స్‌‌ బౌలర్లు పూర్తి న్యాయం చేశారు. చల్లటి వాతావరణం, పిచ్‌‌ నుంచి వస్తున్న సపోర్ట్‌‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ఆరంభం నుంచే వరుస వికెట్లతో ఆర్సీబీని ఒత్తిడిలోకి నెట్టారు. ఇన్నింగ్స్ నాలుగో బాల్‌‌కే ఓపెనర్‌‌‌‌ ఫిల్‌‌ సాల్ట్‌‌ (4)ను ఔట్‌‌ చేసిన అర్ష్​దీప్‌‌ జట్టుకు బ్రేక్ ఇచ్చాడు. తన తొలి బాల్‌‌నే బౌండ్రీకి పంపిన కెప్టెన్ రజత్.. బార్ట్‌‌లెట్‌‌ వేసిన రెండో ఓవర్లో సిక్స్‌‌తో ఆకట్టుకున్నా.. అర్ష్‌‌దీప్‌‌ లెంగ్త్ బాల్‌‌కు కోహ్లీ (1) మార్కో యాన్సెన్‌‌కు క్యాచ్ ఇచ్చి నిరాశపరిచాడు. బార్ట్‌‌లెట్‌‌ బౌలింగ్‌‌లో ఓ ఫోర్ కొట్టిన లివింగ్‌‌స్టోన్ (4) వెంటనే ఆర్యకు క్యాచ్ ఇచ్చాడు. ఐదో ఓవర్లో యాన్సెన్ మూడు రన్సే ఇవ్వగా.. ఆరో ఓవర్లో బౌలింగ్‌‌కు వచ్చిన స్పిన్నర్ చహల్‌‌.. జితేష్ శర్మ (2)ను పెవిలియన్ చేర్చి  నాలుగే రన్స్ ఇచ్చాడు. ఆల్‌‌రౌండర్ క్రునాల్ పాండ్యా (1) యాన్సెన్‌‌కు రిటర్న్ క్యాచ్ ఇవ్వడంతో ఆర్సీబీ 33 రన్స్‌‌కే సగం వికెట్లు కోల్పోయి డీలా పడ్డది. 

ఈ టైమ్‌‌లో క్రీజులోకి వచ్చిన టిమ్ డేవిడ్ ఓ ఎండ్‌‌లో ధాటిగా ఆడినా మరో ఎండ్‌‌లో వికెట్ల పతనం ఆగలేదు. క్రీజులో కుదురుకున్న కెప్టెన్ రజత్‌‌ను ఎనిమిదో ఓవర్లో చహల్ పెవిలియన్ చేర్చగా.. ఇంపాక్ట్ ప్లేయర్ మనోజ్ భండాగె (1)ను యాన్సెన్ ఎల్బీ చేశాడు. చహల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పది ఓవర్లకు 47/7 రన్స్ మాత్రమే చేసిన ఆర్సీబీ త్వరగానే ఆలౌటయ్యేలా కనిపించింది. కానీ, అర్ష్‌‌దీప్ బౌలింగ్‌‌లో రెండు ఫోర్లు కొట్టిన డేవిడ్‌‌ ఇన్నింగ్స్‌‌కు మళ్లీ ఊపు తెచ్చాడు.  హర్‌‌‌‌ప్రీత్ వేసిన 12వ ఓవర్లో  వరుస బాల్స్‌‌లో భువనేశ్వర్ (8), యశ్ దయాల్ (0) ఔటైనా.. డేవిడ్ వెనక్కుతగ్గలేదు. బార్ట్‌‌లెట్‌‌ వేసిన 13వ ఓవర్లో రెండు ఫోర్లు సహా 11 రన్స్‌‌ రాబట్టిన అతను.. హర్‌‌‌‌ప్రీత్ వేసిన ఆఖరి ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లతో స్కోరు 90 దాటించడంతో పాటు ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 

వాధెర ధనాధన్‌‌

 ఛేజింగ్‌‌లో పంజాబ్ సైతం ఆరంభంలో  తడబడింది. ఆర్సీబీ బౌలర్లు పోరాడినా నేహల్ వాధెర జోరును, పంజాబ్ విజయాన్ని అడ్డుకోలేకపోయారు. తొలి ఓవర్లో మూడే రన్స్ ఇచ్చిన పేసర్ భువనేశ్వర్ తన తర్వాతి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన ఓపెనర్‌‌‌‌ ప్రభ్‌‌సిమ్రన్ సింగ్ (13)ను ఔట్‌‌ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఓ ఫోర్, సిక్స్‌‌తో ఊపు మీద కనిపించిన మరో ఓపెనర్‌‌‌‌ ప్రియాన్ష్‌‌ ఆర్య (16)ను నాలుగో ఓవర్లో హేజిల్‌‌వుడ్ వెనక్కు పంపాడు. ఐదో ఓవర్లో యశ్‌‌ దయాల్ మూడే రన్స్ ఇవ్వడంతో పంజాబ్ 36/2తో నిలిచింది. క్రునాల్ బౌలింగ్‌‌లో వరుసగా రెండు ఫోర్లతో జోష్ ఇంగ్లిస్‌‌ (14) జోరు పెంచే ప్రయత్నం చేశాడు.  

కానీ,  స్కోరు ఫిఫ్టీ దాటిన తర్వాత మూడు బాల్స్‌‌ తేడాలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (7)తో పాటు ఇంగ్లిష్‌‌ను ఔట్‌‌ చేసిన హేజిల్‌‌వుడ్‌‌ పంజాబ్‌‌కు డబుల్ స్ట్రోక్ ఇవ్వడంతో ఆర్సీబీ రేసులోకి వచ్చింది. తను కట్టదిట్టంగా బౌలింగ్‌‌ చేసినా  స్పిన్నర్ సుయాశ్ ను టార్గెట్ చేసిన నేహల్ వాధెర అతని రెండు ఓవర్లలో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టడం మ్యాచ్ పంజాబ్ చేతుల్లోకి వెళ్లింది. భువీ బౌలింగ్‌‌లో భారీ షాట్‌‌కు ట్రై చేసి శశాంక్ సింగ్ (1) ఔటైనా..వాధెర 6,4 కొట్టాడు. దయాల్ బౌలింగ్‌లో స్టోయినిస్ (7 నాటౌట్‌‌) సిక్స్‌‌తో మ్యాచ్ ముగించాడు. 

సంక్షిప్త స్కోర్లు


బెంగళూరు: 14 ఓవర్లలో 95/9 (డేవిడ్ 50 నాటౌట్‌‌, రజత్ 23, యాన్సెన్ 2/10, చహల్ 2/11).
పంజాబ్: 12.1 ఓవర్లలో 98/5 (నేహల్ వాధెర 33 నాటౌట్‌‌,  హేజిల్‌‌వుడ్ 3/14, 
భువనేశ్వర్ 2/26)