IND vs SL ODI: దిక్కుతోచని స్థితిలో శ్రీలంక.. వన్దే సిరీస్‌కు ఐదుగురు పేసర్లు దూరం

IND vs SL ODI: దిక్కుతోచని స్థితిలో శ్రీలంక.. వన్దే సిరీస్‌కు ఐదుగురు పేసర్లు దూరం

టీమిండియాతో వన్డే సిరీస్ కు ముందు శ్రీలంక కష్టాలు ఎక్కువయ్యాయి. టీ20 సిరీస్ కు ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు దూరం కాగా.. తాజాగా మరో ఇద్దరు సీమర్లు గాయం కారణంగా వన్డే సిరీస్ నుంచి దూరమయ్యారు. టీ20 సిరీస్ లో తొలి రెండు టీ20 మ్యాచ్ లాడిన పతిరానా, దిల్షాన్ మధుశంక మూడో టీ20 మ్యాచ్ సందర్భంగా గాయాలపాలయ్యారు. ఈ మ్యాచ్ లో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా పతిరణ భుజం గాయంతో ఇబ్బందిపడ్డాడు. దీంతో ఇన్నింగ్స్ మధ్యలోనే డగౌట్ కు వెళ్లి మళ్ళీ బౌలింగ్ చేయడానికి తిరిగి రాలేదు. 

పతిరానా గాయం తీవ్రం కావడంతో అతను వన్డే సిరీస్ నుంచి దూరమయ్యాడు. మరోవైపు లెఫ్ట్ ఆర్మ్ సీమర్ మధుశంకను స్నాయువు గాయం వేధిస్తుంది. ఈ ఇద్దరితో పాటు శ్రీలంక చమీర, బినురా ఫెర్నాండో, నువాన్ తుషార్ సేవలను కోల్పోనుంది. మొదటి టీ20కు ముందు బినురా ఫెర్నాండో ఆస్పత్రి పాలయ్యాడు. ఛాతీ ఇన్‌ఫెక్షన్ కారణంగా అతను ఆసుపత్రిలో చేరవలసి వచ్చినట్లు లంక క్రికెట్ బోర్డు ప్రకటన చేసింది. ప్రాక్టీస్ చేస్తూ తుషార గాయపడగా.. చమీర ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. 

ఒకసారి ఐదుగురు ఫాస్ట్ బౌలర్లు దూరం కావడంతో ప్రస్తుతం శ్రీలంక పరిస్థితి గందరగోళంగా మారింది. ఆ జట్టు ఎవరిని ఎంపిక చేస్తుందో త్వరలో తెలపనుంది. అసిత ఫెర్నాండో, చమిందు విక్రమసింగే మాత్రమే ఆ జట్టులో పేసర్లు. హసరంగా, తీక్షణ, వెళ్లలాగే, అఖిల ధనుంజయ్ లతో ఆ జట్టు స్పిన్ విభాగం బలంగా కనిపిస్తుంది. హసరంగా, తీక్షణ లపైనే శ్రీలంక జట్టు ఆశలు పెట్టుకుంది. మూడు వన్డే సిరీస్ లో భాగంగా తొలి వన్డే శుక్రవారం (ఆగస్టు 2) జరుగుతుంది. ఆదివారం (ఆగస్టు 4) రెండో వన్డే.. బుధవారం (ఆగస్టు 7) మూడో వన్డే జరుగుతాయి. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు కొలంబోలోని ప్రేమదాస అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి.