- రూ. 17 లక్షలు పోగొట్టుకున్న యువకుడు
- అమ్మాయిల ఫొటోలతో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి అబ్బాయిలకు రిక్వెస్ట్
- తర్వాత కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగా లేదంటూ డబ్బులు వసూలు
- దంపతులను అరెస్ట్ చేసిన పోలీసులు
గోదావరిఖని, వెలుగు : మ్యాట్రిమోని పేరుతో మోసాలు చేస్తున్న దంపతులను ఆదివారం రామగుండం కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్ ఏసీపీ ఎం.వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని ఏలూరు అశోక్‌నగర్‌కు చెందిన ఎర్ర వెంకటనాగరాజు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం హరిపురం గ్రామానికి చెందిన రామంచ సౌజన్యతో పెండ్లి జరిగింది. వీరిద్దరు కలిసి ‘మ్యాట్రిమోని.కామ్’ పేరుతో ఓ వెబ్‌సైట్ క్రియట్ చేసి పెండ్లి సంబంధాలు చూస్తామంటూ ప్రచారం చేసుకున్నారు.
అందమైన అమ్మాయిల ఫొటోలతో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తూ అబ్బాయిలకు రిక్వెస్ట్ పంపేవారు. మంచిర్యాల జిల్లాకు చెందిన, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు వెబ్‌సైట్‌లో అమ్మాయి ఫొటో చూసి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడంతో వెంకటనాగరాజు చాటింగ్ ప్రారంభించాడు. అవతలి వైపు ఉన్నది అమ్మాయే అనుకొని సదరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సైతం చాటింగ్ చేస్తూ కొన్ని రోజుల తర్వాత పెండ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు.
ఈ టైంలో అవతలి వైపు చాటింగ్ చేస్తున్న వ్యక్తి తన అమ్మకు ఆరోగ్యం బాలేదని, హాస్పిటల్ ఉందని, డబ్బులు పంపించాలని కోరేవాడు. దీంతో ఆ యువకుడు రూ. 60 వేలు పంపించాడు. తర్వాత పలుమార్లు డబ్బులు అడగడంతో ఆగస్ట్ 8 నుంచి అక్టోబర్ 17 వరకు పలు విడతలుగా మొత్తం రూ. 17 లక్షలు సెండ్ చేశాడు. అయినా ఇంకా డబ్బులు కావాలని అవతలి వ్యక్తి అడగడంతో అనుమానం వచ్చిన యువకుడు గట్టిగా నిలదీయంతో అవతలి వైపు ఫోన్ స్విచాఫ్ అయింది. దీంతో మోసపోయానని గ్రహించిన యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేసి హరిపురంలో గ్రామంలో ఉన్న వెంకటనాగరాజు, సౌజన్యను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.