- 12 గంటల్లో పాతాళానికి పోయొస్తది
- సబ్ మెర్సిబుల్ వెహికల్‌ను టెస్టులకు సిద్ధం చేసిన ఎన్ఐవోటీ
న్యూఢిల్లీ: సముద్రయాన్‌కు భారత్ సిద్ధమవుతున్నది. సముద్రం అడుగున పరిశోధనల కోసం తయారు చేసిన ‘మత్స్య 6000’ సబ్ మెర్సిబుల్ వెహికల్ రెడీ అయింది. పన్నెండు గంటల్లో సముద్రంలో 6 వేల మీటర్ల అడుగుకు ఈ వెహికల్ వెళ్లి వస్తుంది. దీన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ(ఎన్ఐవోటీ) రూపొందించింది.
మత్స్య వెహికల్ కు ముందుగా చెన్నై హార్బర్ వద్ద 15 మీటర్ల లోతులో వెట్ టెస్ట్ నిర్వహిస్తామని, ఆ తర్వాత వచ్చే ఏడాదిలో సముద్రపు నీటిలో మరింత లోతుకు పంపి పరీక్షిస్తామని ఎన్ఐవోటీ వెల్లడించింది. ఫైనల్ గా 2026లో మనుషులు లేకుండా సముద్రం అడుగుకు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నామని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే మానవ సహిత యాత్ర చేపడతామని ఎన్ఐవోటీ తెలిపింది. మానవ సహిత మిషన్ లో భాగంగా మత్స్య వెహికల్ లో ముగ్గురు సైంటిస్టులను పంపుతామని పేర్కొంది. డీప్ సీ ఓషన్ మిషన్‌లో భాగంగా రూ. 4,077 కోట్లతో ఈ ప్రాజెక్టును కేంద్రం చేపట్టింది. ఇప్పటివరకూ అమెరికా, రష్యా, చైనా, జపాన్, ఫ్రాన్స్ మాత్రమే డీప్ సీ ఓషన్ మిషన్లు చేపట్టగలిగాయి. సముద్రయాన్ సక్సెస్ అయితే.. సబ్ మెర్సిబుల్ వెహికల్స్ తో సముద్రం అడుగును శోధించగల సత్తా కలిగిన ఆరో దేశంగా భారత్ నిలవనుంది.
ఎమర్జెన్సీ వస్తే.. 96 గంటలు సేఫ్
గోళాకారంగా, 4.2 మీటర్ల వెడల్పుతో ఉండే మత్స్య సబ్ మెర్సిబుల్ వెహికల్ లో ముగ్గురు సైంటిస్టులను 6 వేల మీటర్ల లోతున సముద్రం అడుగుకు పంపేందుకు ఎన్ఐవోటీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మిషన్ టైమ్ 12 గంటలుగా నిర్ణయించింది. సముద్రం అడుగుకు వెళ్లేందుకు 3 గంటలు, పైకి వచ్చేందుకు 3 గంటలు.. పరిశోధనలకు 6 గంటల పడుతుందని అంచనా. మత్స్య వెహికల్ 12 నుంచి 16 గంటలపాటు నిరంతరాయంగా పని చేయగలదు. ఆ తర్వాత ఒకవేళ ఎమర్జెన్సీ తలెత్తితే.. ఇందులో ఉన్నోళ్ల ప్రాణాలకు ప్రమాదం లేకుండా 96 గంటలపాటు ఆక్సిజన్ సప్లై కొనసాగనుంది. ఆ లోపే వారిని కాపాడే చాన్స్ ఉంటుంది. భూ ఉపరితలంపై కంటే 600 రెట్లు ఎక్కువ ప్రెజర్ పడినా తట్టుకునేలా దృఢమైన 80 ఎంఎం టైటానియం అల్లాయ్ షీట్లతో మత్స్య వెహికల్ ను తయారు చేశారు. మిషన్ మొత్తాన్ని ఈ నౌక నుంచే సైంటిస్టులు కంట్రోల్ చేయనున్నారు. కాగా, విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకటైన మత్స్యావతారం గుర్తుగా ఈ వెహికల్ కు నామకరణం చేశారు.