చంద్రయాన్ 3 సక్సెస్తో సముద్రయాన్‌.. బంగాళాఖాతంలో 6 వేల అడుగుల లోతుకు మత్స్య 6000

చంద్రయాన్ 3 సక్సెస్తో సముద్రయాన్‌.. బంగాళాఖాతంలో 6 వేల అడుగుల లోతుకు మత్స్య 6000

చంద్రయాన్‌-3 విజయవంతం కావడంతో భారతదేశం ..త్వరలో సముద్రయాన్‌ను  చేపట్టనుంది.  సముద్రయాన్‌ మిషన్‌ పేరుతో సముద్రం అడుగు భాగానికి యాత్రను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. సముద్రయాన్ పేరుతో సముద్రం అడుగున 6 వేల మీటర్ల లోతుకు జలాంతర్గామి  పంపనున్నారు. ఈ  ప్రాజెక్టులో కీలకమైన జలాంతర్గామి మత్స్య-6000 సముద్రయాన్ కు తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఆ సబ్‌ మెర్సిబుల్  ఫొటోలు, వీడియోలను కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

సముద్రపు  లోతులను అన్వేషించే మానవసహిత సబ్ మెర్సిబుల్ మత్స్య  6000 నౌకను చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అభివృద్ధి చేస్తోంది. ఇది దేశంలోనే మొట్టమొదటి మానవసహిత సముద్ర అన్వేషణ మిషన్. ఆక్వానాట్‌లను సముద్రంలో 6,000 మీటర్ల లోతుకు తీసుకెళ్లేందుకు గోళాకార సబ్ మెరైన్ ను నిర్మిస్తున్నారు.  ఇది మొదటగా 500 మీటర్ల మేర నీటి అడుగులకు ప్రయాణం చేయనుంది. ఈ మిషన్‌ కారణంగా సముద్ర గర్భంలోని పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లదు.

 మత్స్య-6000 జలాంతర్గామిలో ముగ్గురు కూర్చొని 6 కిలోమీటర్ల సముద్రపు లోతుకు ప్రయాణించవచ్చు. దీని ద్వారా సముద్ర వనరులు, జీవ వైవిధ్యంపై అధ్యయనం జరపవచ్చు. సముద్ర అడుగు భాగంలోకి  కోబాల్డ్, నికెల్, మాంగనీస్ వంటి విలువైన లోహాలు, ఖనిజాల గురించి అన్వేషించనుంది. 2024 లేదా 2025లో  చెన్నై తీరంలో బంగళాఖాతంలోకి ముగ్గురు ఆక్వానాట్స్‌ను మత్స్య 6000 ద్వారా పంపేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకూ అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా మాత్రమే మానవసహిత సబ్‌‌లను అభివృద్ధి చేశాయి. మత్య్స పూర్తయితే..ఈ జాబితాలో భారత్ కూడా చేరనుంది.