ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అణ్వాయుధాల కంటే ప్రమాదకరమని, దానిని సరైన విధంగా వినియోగించకపోతే అది కేవలం రెండేళ్లలోనే మానవులను చంపేంత శక్తివంతంగా మారే సూచనలు ఉన్నాయని యూకే ప్రధాన మంత్రి రిషి సునాక్ సలహాదారు మాట్ క్లిఫోర్డ్ హెచ్చరించారు. కృత్రిమ మేధ సాయంతో సైబర్, బయోలాజికల్ ఆయుధాలను సృష్టించే అవకాశం ఉందని, అది అనేక మరణాలకు దారితీస్తుందని ఆయన తెలిపారు. ఏఐతో మానవ మనుగడకు ప్రమాదం ఉందా? అన్న ప్రశ్నకు క్లిఫోర్డ్ ఈ సమాధానమిచ్చారు.
'మనం మానవుల కంటే ఎక్కువ తెలివైన కృత్రిమ మేధను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాం.. అలాంటప్పుడు దానిని ఎలా నియంత్రించాలో కూడా మనకు తెలియాలి. లేదంటే ముప్పు తప్పకపోవచ్చు. అలాగే, ఏఐని సరైన మార్గంలో ఉపయోగించినట్లయితే అది మంచి కోసం ఒక శక్తిగా కూడా ఉపయోగపడుతుందని నేను చెప్పగలను..' అని మాట్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం క్లిఫోర్డ్ ప్రభుత్వ ఫౌండేషన్ మోడల్ టాస్క్‌ఫోర్స్‌లో ప్రధాన మంత్రికి నాయకత్వం వహిస్తున్నారు. ఇది చాట్‌జిపిటి, గూగుల్ బార్డ్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పరిశోధిస్తోంది.
కాగా, ఏఐతో ముప్పు తప్పదని ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్ ఇప్పటికే హెచ్చరించారు. ఏఐ సాంకేతికతపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలన్నది వారి అభిప్రాయం. ఇదిలావుంటే మానవ మేధతో పోటీ పడుతూ ఏఐ సాంకేతికతో వస్తోన్న వ్యవస్థలు సమాజానికి, మానవాళికి తీవ్ర ముప్పును తలపెట్టే ప్రమాదం ఉందని ప్రముఖ టెక్ సంస్థల అధిపతులు చెప్తున్నారు.