కల్లూరు, వెలుగు : దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సదరం సర్టిఫికెట్ల జారీ కోసం మండల కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాల ఏర్పాటుకు కృషి చేస్తానని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ తెలిపారు. సోమవారం కల్లూరు లోని నూతన బస్టాండ్ ప్రాంగణంలో కాంగ్రెస్ నాయకుడు పసుమర్తి చందర్రావు సతీమణి పద్మావతి జయంతి సందర్భంగా దివ్వాంగుల బస్ పాస్‌లకు 50 శాతం డబ్బులను అందించారు. రాయితీ పాసుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగుల బస్సు పాసుల కోసం నగదు సాయం చేసిన చందర్రావును అభినందించారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించడం కోసం అన్ని వర్గాల ప్రజలు కృషి చేశారని, వారందరికీ అండగా ఉంటానని చెప్పారు. సుమారు 276 మందికి 50 శాతం రాయితీ పాసులను అందించినట్లు సత్తుపల్లి ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ దామోదర్ రెడ్డి, విలేజ్ బస్ ఆఫీసర్ కిన్నెర ఆనందరావు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఏనుగు సత్యంబాబు, బొల్లం రామారావు, ఎనుముల రుక్మిణి యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగన్న బోయిన పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.