మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ్

మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం  మిత్ర విభూషణ్
  • అందజేసిన ఆ దేశ ప్రెసిడెంట్ అనుర కుమార దిసనాయకే 
  • భారత్, శ్రీలంక మధ్య 10 ఒప్పందాలు
  • డిఫెన్స్, ఎనర్జీ, ఫార్మా రంగాల్లో ఎంవోయూలు
  • శ్రీలంకలోని తమిళులకు 10 వేల ఇండ్లు కట్టిస్తామని ప్రధాని ప్రకటన
  • తమిళ జాలర్లను రిలీజ్​ చేయాలని శ్రీలంక ప్రెసిడెంట్​కు మోదీ విజ్ఞప్తి

కొలంబో: భారత్, శ్రీలంకల భద్రత ఒకదానికొకటి ముడిపడి ఉందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈమేరకు శ్రీలంకలో పర్యటిస్తున్న మోదీ శనివారం శ్రీలంక ప్రెసిడెంట్ అనుర కుమార దిసనాయకేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలపై కీలకమైన చర్చలు జరిపారు. భారత ప్రయోజనాలకు విరుద్ధంగా తమ భూభాగాన్ని వినియోగించుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని దిసనాయకే హామీ ఇచ్చారు. 

దీనిపై మోదీ స్పందిస్తూ.. ‘‘భారత ప్రయోజనాల విషయంలో దిసనాయకే సానుకూలంగా స్పందిస్తున్నందుకు కృతజ్ఞతలు. రెండు దేశాల భద్రత ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నది. డిఫెన్స్ రంగంలో జరిగిన ఒప్పందాలను స్వాగతిస్తున్నాను” అని పేర్కొన్నారు. కాగా, చర్చల్లో భాగంగా తమిళ జాలర్ల సమస్యలను మోదీ లేవనెత్తారు. తమిళ జాలర్లను విడుదల చేయాలని, వాళ్ల బోట్లను తిరిగి అప్పగించాలని దిసనాయకేకు విజ్ఞప్తి చేశారు. తమిళ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని, ప్రొవిన్షియల్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. శ్రీలంకలోని తమిళుల కోసం త్వరలో 10 వేల ఇండ్లు నిర్మిస్తామని మోదీ ప్రకటించారు. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య 10 ఒప్పందాలు కుదిరాయి.

ఇవీ ఒప్పందాలు.. 

శ్రీలంక తీసుకున్న లోన్ల రీస్ట్రక్చర్‌‌‌‌, వడ్డీ రేట్లు తగ్గించేందుకు మన దేశం ఒప్పుకుంది. శ్రీలంకలోని తూర్పు ప్రావిన్స్‌‌ల అభివృద్ధికి 240 కోట్లు (శ్రీలంక కరెన్సీ) ఇస్తామని ప్రకటించింది. సాంపూర్ పవర్ ప్రాజెక్టును వర్చువల్‌‌గా మోదీ, దిసనాయకే ప్రారంభించారు. రెండు దేశాల మధ్య కరెంట్ సరఫరాకు గ్రిడ్ కనెక్టివిటీ చేయాలని నిర్ణయించారు. ట్రింకోమలిని ఎనర్జీ హబ్‌‌గా అభివృద్ధి చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో యూఏఈ కూడా భాగస్వామిగా ఉంది. ఫార్మా, హెల్త్ రంగాల్లోనూ ఒప్పందాలు జరిగాయి.

భారత ప్రధానికి ఘన స్వాగతం.. 

ప్రధాని మోదీకి శ్రీలంకలో ఘన స్వాగతం లభించింది. బ్యాంకాక్ పర్యటనను ముగించుకుని మోదీ శుక్రవారం సాయంత్రం కొలంబోకు చేరుకున్నారు. ఆయనకు శనివారం చారిత్రక ఇండిపెండెన్స్ స్క్వేర్‌‌‌‌లో శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే స్వాగతం పలికారు. ఒక విదేశీ లీడర్‌‌‌‌కు ఇండిపెండెన్స్ స్క్వేర్‌‌‌‌ వద్ద స్వాగతం లభించడం ఇదే మొదటిసారి.

మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం ‘మిత్ర విభూషణ్‌‌’

ప్రధాని మోదీకి శ్రీలంక అవార్డు అందజేసింది. తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘మిత్ర విభూషణ్‌‌’తో ఆయనను సత్కరించింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేసినందుకు గాను ఈ అవార్డు ప్రదానం చేసింది. కొలంబోలోని అధ్యక్ష కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో శ్రీలంక ప్రెసిడెంట్ దిసనాయకే ఈ అవార్డును మోదీకి అందజేశారు. దీనిపై మోదీ స్పందిస్తూ.. ‘‘ఈ అవార్డు 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం” అని పేర్కొన్నారు.