ఆస్ట్రేలియా- భారత్ జట్ల మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉండడం గ్యారంటీ. టెస్ట్ క్రికెట్ లో అసలైన మజాను చూపిస్తాయి. అగ్ర జట్లు.. స్టార్ ఆటగాళ్లు.. స్టేడియం నిండా ప్రేక్షకులు.. వెరసి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆసక్తికరంగా మారుస్తాయి. మరోసారి ఈ మెగా సిరీస్ అభిమానులకు కిక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సిరీస్ కు మరో మూడు నెలల సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే క్రికెట్ ఎక్స్ పర్ట్స్ తమ ప్రిడిక్షన్ చెబుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ గురించి మాట్లాడాడు.
హెడ్లైన్ ఈవెంట్లో హేడెన్ మాట్లాడుతూ.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ, స్టీవెన్ స్మిత్ ఆట కోసం ఎదురు చూస్తున్నానని చెప్పాడు. ఇద్దరి కెరీర్ చివరి దశలో ఉన్నా వీరు తమ జట్లకు కీలకంగా మారతారని.. లీడింగ్ రన్ స్కోరర్ లో వీరే టాప్ లో ఉంటారని ఆయన అన్నాడు. ఇక ఈ సిరీస్ లో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్టు ఆడతాయని.. ఎవరు గెలుస్తారో అంచానా వేయడం కష్టమని ఈ ఆసీస్ మాజీ ఓపెనర్ తెలిపాడు. ప్రస్తుతం కోహ్లీ, స్మిత్ ఇద్దరు కూడా టెస్టుల్లో పరుగులు చేయడానికి ఇబ్బందిపడుతున్నారు. 2023 నుంచి స్మిత్ యావరేజ్ కేవలం 39 మాత్రమే. మరోవైపు కోహ్లీ స్పిన్ ఆడడంలో తడబడుతున్నాడు.
ALSO READ | IND vs ENG 2025: ఇంగ్లాండ్తో భారత్ టెస్ట్ సిరీస్.. పూర్తి షెడ్యూల్ ప్రకటన
రోహిత్ శర్మ కెప్టెన్ గా భారత్ ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. నవంబర్ 22 నుంచి జనవరి 3 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. ఆస్ట్రేలియా గడ్డపై చివరగా జరిగిన రెండు టెస్టుల సిరీస్ను భారత జట్టు గెలుచుకుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ 72 ఏళ్లలో తొలిసారి 2-1 తేడాతో ఆసీస్ గడ్డపై సిరీస్ గెలిస్తే.. 2020-21లో తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే సారధ్యంలో 2-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది. చివరిసారిగా 2023 లో నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో గెలుచుకోవడం విశేషం.