ఆస్ట్రేలియా- భారత్ జట్ల మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉండడం గ్యారంటీ. టెస్ట్ క్రికెట్ లో అసలైన మజాను చూపిస్తాయి. అగ్ర జట్లు.. స్టార్ ఆటగాళ్లు.. స్టేడియం నిండా ప్రేక్షకులు.. వెరసి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆసక్తికరంగా మారుస్తాయి. మరోసారి ఈ మెగా సిరీస్ అభిమానులకు కిక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది. ఈ సిరీస్ పై తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ గురించి మాట్లాడాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ, స్టీవెన్ స్మిత్ ఆట కోసం ఎదురు చూస్తున్నానని చెప్పాడు. ఇద్దరి కెరీర్ చివరి దశలో ఉన్నా వీరు తమ జట్లకు కీలకంగా మారతారని.. లీడింగ్ రన్ స్కోరర్ లో వీరే టాప్ లో ఉంటారని ఆయన అన్నాడు. ఆస్ట్రేలియా 3-1 తేడాతో సిరీస్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు. బ్యాటింగ్ లో స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లి.. బౌలింగ్ లో పాట్ కమిన్స్, జస్ప్రీత్ బుమ్రా ఎలా బౌలింగ్ ఈ సిరీస్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని హేడెన్ తెలిపాడు.
రోహిత్ శర్మ కెప్టెన్ గా భారత్ ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. నవంబర్ 22 నుంచి జనవరి 3 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. ఆస్ట్రేలియా గడ్డపై చివరగా జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత జట్టు గెలుచుకుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ 72 ఏళ్లలో తొలిసారి 2-1 తేడాతో ఆసీస్ గడ్డపై సిరీస్ గెలిస్తే.. 2020-21లో తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే సారధ్యంలో 2-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది. చివరిసారిగా 2023 లో నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో గెలుచుకోవడం విశేషం.